
'అందంగా ఉంటుందనే ప్రేమించొద్దు'
న్యూఢిల్లీ: 'అందంగా ఉంటుందని మాత్రమే కశ్మీర్ ను ప్రేమించకండి.. అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయినవారినికి కూడా ప్రేమను పంచండి' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కశ్మీరీ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. గడిచిన 32 రోజులుగా కశ్మీర్ లో అట్టుడుకుతున్న ఆందోళనలపై బుధవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన.. మిగతా భారతీయులలాగే కశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ)
'32 రోజుల తర్వాతైన కశ్మీర్ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చను అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాధాలు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలిసిపోయామా?లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కశ్మీరీ కుటుంబం ఉగ్రవాద పీడను అనుభవించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. 32 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహావేశాలకు కారణం ఏదైనా కావచ్చు.. దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడైనా కశ్మీరీలకు సంఘీభావం తెలపండి. అఖిలపక్షాన్ని పంపి, పరిస్థితులు చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే.. కశ్మీరీలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతాం'అని గులాం నబీ ఆజాద్ అన్నారు.
తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీకి వినబడుతుందా?
దళితులపై దాడులు, కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ సమస్యలపై పార్లమెంట్ లో కాకుండా బయటి సభల్లో స్పందించడమేమిటని ఆజాద్ ప్రశ్నించారు. 'తెలంగాణలో జరిగిన సమావేశంలో మీరు(ప్రధాని) దళితులపై దాడులను ఖండించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదు. ఆ ప్రకటనేదో ఇక్కడి నుంచే చేస్తే సబబుగా ఉండేది'అని ఆజాద్ వ్యాఖ్యానించారు.