
‘కేంద్ర పాలితం’ వద్దు: అసదుద్దీన్ ఒవైసీ
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవద్దని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. సోనియాతో శుక్రవారం ఉదయం అరగంటపాటు ఆయన సమావేశమయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ.. జీవోఎం ఎదుట తాము ప్రతిపాదించిన అంశాలన్నింటినీ సోనియాకు వివరించానన్నారు. హైదరాబాద్‌లోని శాంతిభద్రతలు, రెవిన్యూ, మున్సిపల్ పరిపాలన వ్యవహారాలు రాష్ట్రం పరిధిలోనే ఉంచాలని, వాటిపై కేంద్ర పర్యవేక్షణ సరికాదని, సమాఖ్య వ్యవస్థలో శాంతి భద్రతల అంశం రాష్ర్టం పరిధిలోనే ఉండాలని తెలిపానని ఒవైసీ చెప్పారు.
ఒకవేళ కేంద్రానికి ఆ బాధ్యతను అప్పగిస్తే ఎన్డీఏ అధికారంలోకి వస్తే దాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిం చుకునే అవకాశముందని, తద్వారా మతకలహాలు చెలరేగే ప్రమాదముందని హెచ్చరించానని తెలిపారు. హైదరాబాద్‌కు ఉన్న భౌగోళిక సరిహద్దులన్నీ తెలంగాణతో ముడిపడి ఉన్నవే కాబట్టి ఉమ్మడి రాజధాని చేసినా సీమాంధ్ర రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. అందువల్ల హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలనే ప్రతిపాదననూ వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ర్ట రాజధాని కూడా మరో రాష్ట్రానికి రాజధానిగా లేదనే విషయాన్ని గుర్తు చేశారు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మన్మోహ న్‌లను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరానని, అవకాశమిస్తే ఇదే విషయాన్ని వారికీ వివరిస్తానన్నారు.