ఇబ్బందులకు లోన్ కావద్దు | dont take loans in critical time | Sakshi
Sakshi News home page

ఇబ్బందులకు లోన్ కావద్దు

Published Sun, Oct 13 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

ఇబ్బందులకు లోన్ కావద్దు

ఇబ్బందులకు లోన్ కావద్దు

కొన్నాళ్లుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ధరలు పెద్దగా పెరిగింది లేదు. గతంతో పోలిస్తే ప్రాంతాలను బట్టి ధరలు కాస్తో కూస్తో తగ్గాయి కూడా. దీనికితోడు బ్యాంకులు కూడా బేస్ రేటుకే రుణాలందించడానికి ముందుకొస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇవన్నీ శుభ సూచకాలే. మిగిలిన అంశాలను పరిశీలించకుండా ఈ రెండుకారణాలతోనే ఇంటి రుణం తీసుకుంటే ఇబ్బందులుతప్పవంటున్నారు నిపుణులు. మొదటిసారి ఇంటి రుణం తీసుకోవాలనుకునే వారు పాటించాల్సిన అంశాలపై ఈ వారం
 
 ప్రాఫిట్ ప్రధాన కథనమిది...
 ఆర్థిక మందగమనం స్థిరాస్తి రంగంపై బాగానే ప్రభావం చూపుతోంది. రెండేళ్ళుగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఈ క్షీణతను మరింత పెంచాయి. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ధరలు 10% పైగా తగ్గినట్లు ఆర్థిక సంస్థల అంచనా. అలాగే డిమాండ్ కంటే సప్లయ్ కూడా 15% అధికంగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 నిజంగా తగ్గాయా?..
 రియల్ ఎస్టేట్ ధరలు తగ్గినా సంస్థలు ఆ విషయాన్ని ఎక్కడా నేరుగా చెప్పడానికి ఇష్టపడటం లేదు. ధరలు తగ్గాయి అన్న వార్తలు వెలువడితే అవి మరింత క్షీణిస్తాయన్న భయమే దీనికి కారణం. దీనికి బదులు రియల్ ఎస్టేట్ సంస్థలు ఆఫర్ల పేరుతో ఖాతాదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. స్టాంపు డ్యూటీ తగ్గిస్తామని, లేదా ఫ్లాట్స్ లో అదనపు సౌకర్యాలు కల్పిస్తామని, కార్లు, విదేశీ ప్రయాణం పేరుతో అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఇంటిని కొనుగోలు చేసే ముందు ఆ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? తగ్గాయా? ఆ సంస్థ ప్రకటించిన ఆఫర్లతో ఏమైనా ప్రయోజనం ఉందా అన్న విషయాలను తప్పకుండా పరిశీలించాలి. ఈ వివరాలన్నీ సేకరించి రియల్ ఎస్టేట్ సంస్థలతో గట్టిగా డిమాండ్ చేసి బేరమాడితే మరింత డిస్కౌంట్‌ను పొందే అవకాశముంటుంది కూడా.
 
 జేబులో ఎంతుండాలి?
 మన రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఇప్పుడు మంచి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధరలు శివారు ప్రాంతాల్లో అయితే రూ.30 లక్షల వరకు ఉంటే కొద్దిగా సిటీకి దగ్గరైతే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటున్నాయి. ఇప్పుడు బ్యాంకులు ఇంటి విలువలో గరిష్టంగా 80 శాతానికి మించి రుణం ఇవ్వడం లేదు. అంటే రూ.30 లక్షలకు రుణం తీసుకుంటున్నారంటే చేతిలో కనీసం ఆరు లక్షలుండాలి. ఇది కాకుండా ప్రోసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ తదితర ఖర్చులకు మరో రెండు లక్షలు అవసరమవుతాయి. అంటే కనీసం రూ.8 నుంచి రూ.10 లక్షలు జేబులో ఉంటేనే సొంతింటికి రంగంలో దిగాలన్నమాట.
 
 రుణం ఎంతొస్తుంది?
 సాధారణంగా బ్యాంకులు నెల జీతానికి 50 నుంచి 60 రెట్ల వరకు రుణం ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. అదే వ్యాపారస్తులు అయితే సగటు నెల ఆదాయంపై 40 రెట్ల వరకు ఇస్తున్నాయి. ఉదాహరణకు మీ నెల జీతం రూ.50,000 అనుకుంటే  మీకు గరిష్టంగా రూ.25-30 లక్షల రుణం లభిస్తుంది. ఈ నిబంధన తర్వాత బ్యాంకులు మరో అంశాన్ని కూడా పరిశీలిస్తాయి. మీరు చెల్లించే ఈఎంఐలు జీతంలో గరిష్టంగా 60 శాతం దాటకూడదు. దీన్ని పరిశీలించేటప్పుడు మీకు ఏమైనా రుణాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు రూ.30 లక్షలకు గృహరుణం తీసుకుంటే ప్రస్తుత వడ్డీరేట్ల ప్రకారం ప్రతీ నెలా దాదాపు రూ.30,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. అంటే రూ.50,000 జీతం ఉన్న వ్యక్తి ఈ మొత్తానికి రుణం తీసుకోవాలంటే అతనికి ఇక ఎటువంటి రుణాలు ఉండకూడదు. ఉంటే ఆ మేరకు మంజూరయ్యే రుణం తగ్గుతుంది.
 
 వడ్డీరేట్ల పరిస్థితేంటి?
 వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయా లేక పెరిగే అవకాశం ఉందా...? అనే అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ప్రస్తుతం ఈ పండుగలను దృష్టిలో పెట్టుకొని రెండు మూడు నెలల కాలానికి మాత్రమే బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారితే... వడ్డీరేట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు తక్కువ రేటులో రుణం తీసుకునే వారు భవిష్యత్తులో పెరిగే రిస్క్ ఉందన్న అంశాన్ని మర్చిపోవద్దు. రుణం తీసుకునేటప్పుడు ఈఎంఐకి పోగా మిలిగిన మొత్తంతో కుటుంబ అవసరాలు, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి తగినంత మొత్తం కేటాయించగలుగుతున్నారా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలించాలి. ఈఎంఐ భారం తగ్గించుకోవడానికి చాలామంది రుణ కాలపరిమితిని పెంచుకుంటారు. దీని వలన చెల్లించే వడ్డీ భారం బాగా పెరిగిపోతుంది. సాధ్యమైనంత వరకు గృహరుణాన్ని 15 ఏళ్ళు తప్పదంటే 20 ఏళ్ళలోపు పూర్తి చేసే విధంగా ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన.
 
 పన్ను ప్రయోజనాలు: ఇంటి ధరలు బాగా పెరిగిపోవడంతో కేవలం ఒక వ్యక్తి మాత్రమే రుణం తీసుకుంటే దానిపై లభించే పన్ను ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఈఎంఐలో వడ్డీ కింద చెల్లించే దాంట్లో సంవత్సరానికి గరిష్టంగా రూ.1.50 లక్షల మించి పన్ను ప్రయోజనాన్ని పొందలేము. రూ.30 లక్షలకి గృహరుణం తీసుకుంటే మొదటి ఐదేళ్ళ వరకు దాదాపుగా సంవత్సరానికి రూ.3 లక్షలు చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాని దీనిపైన పన్ను ప్రయోజనం గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే పొందగలం. కాబట్టి పన్ను ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే గృహరుణాన్ని ఉమ్మడిగా తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన. దీని వలన ఈఎంఐ భారం తగ్గడంతో పాటు, పన్ను ప్రయోజనాలను పూర్తిగా పొందచ్చు.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 చూడాల్సినవి?
   తీసుకునే ఇంటి విలువ మీ బడ్జెట్ స్థాయిలో ఉందా?
   ఆదాయానికి రుణం ఎంత లభిస్తుంది?
   డౌన్ పేమెంట్‌కు కావల్సిన మొత్తం చేతుల్లో ఉన్నాయా?
   ఈఎంఐ చెల్లించడానికి కావల్సిన స్థిరమైన ఆదాయం ఉందా?
   ఇతర అప్పులను నియంత్రించే స్థాయి ఉందా?
   రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఇన్వెస్ట్‌మెంట్ కేటాయించగలరా?
 
 హోమ్ లోన్స్
 బ్యాంకు పేరు     వడ్డీరేటు%       ప్రోసెసింగ్ ఫీజు
 ఎస్‌బీహెచ్             10.2           50% తగ్గింపు
 ఆంధ్రా బ్యాంకు       10.25        లేదు
 ఎస్‌బీఐ బ్యాంకు    10.10        కనిష్టంగా రూ.500
 ఐడీబీఐ బ్యాంకు    10.25        లేదు
 పీఎన్‌బీ బ్యాంకు    10.25        లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement