
మనిషి శరీరంలో రక్తం ఎంత ఉంటుంది?
- గ్రూప్స్‌ను మించేలా లెర్నింగ్ లెసైన్స్ పరీక్ష
- వాహనదారులకు సంబంధం లేని కఠిన ప్రశ్నలు
- ఎంవీ చట్టాలపైనా వాహనదారులకు ప్రశ్నలు
- 30 శాతానికి పైగా ఫెయిల్.. తీరుమారని రవాణా శాఖ
- లెర్నింగ్ లెసైన్స్‌ల కోసం 827 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు ఉంది. ఇది ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది. హా అభ్యర్థులు ఈ 827 ప్రశ్నలు-సమాధానాలు చదివి పరీక్షకు హాజరుకావాలి. కానీ వీటిలో 50 శాతం కఠిన ప్రశ్నలే ఉంటాయి.
- ఈ క్వశ్చన్ బ్యాంకు నుంచే 20 ప్రశ్నలతో లెర్నింగ్ టెస్ట్ ఉంటుంది. 10 నిమిషాల్లో కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.
- కఠినమైన ప్రశ్నల వల్ల పన్నెండింటికి కూడా సమాధానాలు రాయలేక సుమారు 30 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఓజోన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది?... మనిషి శరీరంలో ఉండే రక్తం ఎంత?... సఫోకేషన్(ఊపిరాడ కపోవడానికి) ప్రధాన కారణాలేంటి?... సూర్యాస్తమయం తర్వాత లైటు వేయకుండా వాహనం నడపటం ఏ సెక్షన్ కింద నేరం?.. రహదారులపై పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలపై ప్రభుత్వం ఏ సెక్షన్ కింద ఆంక్షలు విధించింది?.. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 120/183(1)ను అతిక్రమిస్తే మొదటి నేరం కింద ఎంత జరిమానా విధిస్తారు?.. ఇవన్నీ సివిల్స్.. గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు కాదు. రవాణా శాఖ లెర్నింగ్ లెసైన్సు కోసం అభ్యర్థులకు పెడుతున్న పరీక్షలోని ప్రశ్నలు. వాహన చోదకుని నైపుణ్యం, ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన వంటి అంశాల్లో అడగాల్సిన ప్రశ్నలు ఇంత కఠినంగా మారడంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ప్రశ్నలస్థాయి కఠినంగా ఉందని అభ్యర్థులు అభ్యంతరం చెపుతున్నా అధికారుల చెవికెక్కడంలేదు. డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో పాటించవలసిన నియమ, నిబంధనలు, జాగ్రత్తల కంటే అభ్యర్థుల మేధస్సును పరీక్షించడమే ధ్యేయంగా రవాణా శాఖ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వాహనదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారుల సాయంతో లెర్నింగ్ లెసైన్సులు తీసుకునే వాహనచోదకులకు రోడ్డు నిబంధనలపై అవగాహన లేకుండా పోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ప్రతి రోజూ 1,000-1,200 మంది లెర్నింగ్ పరీక్షలకు హాజరవుతుండగా.. వీరిలో 300 నుంచి 400 మంది కఠిన ప్రశ్నలను ఎదుర్కోలేక ఫెయిలవుతున్నారు.
ఇదీ పరీక్ష తీరు..
గ్రూప్-1 కొట్టేయొచ్చు
ఆర్టీఏ లెర్నింగ్ లెసైన్స్ పరీక్ష కంటే గ్రూప్- 1 ప్రిలిమ్స్ ఈజీగా రాయొచ్చనిపించింది. ఇందులోని ప్రశ్నలు రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచేలా కాక.. మోటారు వాహన చట్టాలపై అవగాహన కోసం రూపొందించినట్లుగా ఉన్నాయి.
- దేవిరెడ్డి, తార్నాక
డెరైక్ట్‌గా వెళితే ఫెయిలే..
ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటున్నాయి. డెరైక్ట్‌గా వెళితే ఫెయిల్ కావలసిందే. బ్రోకర్ల ద్వారా వెళితే మాత్రం టెస్ట్ లేకుండానే లెసైన్స్ వచ్చేస్తుంది. - బన్నాల ప్రవీణ్ కుమార్, ఉప్పల్
ప్రశ్నల సరళిని మార్చాలి
ప్రతి రోజూ వందలాది మంది లెర్నర్స్ లెసైన్స్ పరీక్ష అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. నేరుగా వెళ్లి పరీక్ష రాసి పాస్ కావడం అసాధ్యం. ఆర్టీఏ అధికారులు ప్రశ్నల సరళిలో మార్పులు చేయాలి.
- గడ్డం రవికుమార్