
విమానం గాల్లో ఉండగానే హల్‌చల్
న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే తలుపు తెరవడానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏరోఫ్లోట్ ఎస్‌యూ 232 విమానం మే 22న రష్యా రాజధాని మాస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అందులో ప్రయాణిస్తున్న రష్యన్ జాతీయుడు అలెగ్జాండర్ సమోఖ్‌వలోవ్ విమానం గాల్లో ఉండగానే తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పైలెట్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.
విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే సీఐఎస్‌ఎఫ్ బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో అలెగ్జాండర్ రక్తంలో ఆల్కహాల్ శాతం 100 ఎం.ఎల్‌కు 56.7 ఎం.ఎల్‌గా ఉందని అధికారులు తెలిపారు. ఇరుదేశాల్లో ఇది 30 ఎం.ఎల్‌కు మించకూడదని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించినందుకు విమానయాన నిబంధనలు–1937 ప్రకారం నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.