‘ఈ-కేటరింగ్’ షురూ
ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ
కోల్‌కతా: ముందస్తు ఆర్డర్లపై ప్రయాణికులకు రైల్వేస్టేషన్లలోనే వారికి కావల్సిన ఆహారాన్ని అందజేసేందుకు ఇండియన్ రైల్వేస్ కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) సోమవారం ఓ పథకాన్ని ప్రారంభించింది. ‘ఈ-కేటరింగ్’ పేరిట దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 45 ప్రధాన రైల్వేస్టేషన్లలో అమలు చేయనున్నారు. దీనికోసం ప్రయాణికులకు కావల్సిన ఆహారాన్ని అందించేందుకు భోజన సరఫరా సంస్థలతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ‘స్టేషన్ ఆధారిత ఈ-కేటరింగ్’గా వ్యవహరిస్తారు. దీనికోసం ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే www.ecatering.irctc.co.in ద్వారా బుక్‌చేసుకోవచ్చు.
లేదా 0120-2383892-99/1800-1034-139 (టోల్ ఫ్రీ) నెంబర్లకు ఫోన్‌చేసి ఆర్డర్ చేయవచ్చు. లేదా 139 నెంబరుకు సంక్షిప్త సందేశం పంపి భోజన సదుపాయాన్ని పొందవచ్చు. అయితే సంస్థలు ఈ ఆహారాన్ని ప్రయాణికులకు సంబంధిత స్టేషన్లలో రైలు ఆగినప్పుడు ప్రయాణికుని బెర్త్ వద్దకు వచ్చి అందజేస్తాయి. చెల్లింపులను నేరుగానే కాకుండా, ఆన్‌లైన్లోనూ చేయొచ్చు. ఈ-కేటరింగ్ ఈస్ట్‌జోన్ పరిధిలోని హౌరా, సీల్దా, విశాఖపట్నం తదితర స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ, చెన్నయ్, బెంగళూరు, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో కూడా సరఫరా చేయనున్నారు.