వైద్య కళాశాలల నిబంధనల్లో సడలింపు
పడకల కనీస పరిమితి 700 నుంచి 300కు తగ్గించడంపై విమర్శలు
హైదరాబాద్: వైద్య విద్యలో ప్రైవేటు కళాశాలల ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లను పెంచుకోవడం, వాటి భర్తీకి సొంతంగా ప్రవేశపరీక్షకు అంగీకరింపజేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా భారత వైద్య మండలి (ఎంసీఐ) కూడా ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి తలొగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పడకల సంఖ్య, బోధనా సిబ్బంది తదితర మౌలిక సదుపాయాలపై నిబంధనలను ఎంసీఐ సడలించడమే దీనికి కారణం. ఎంసీఐ తాజా నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల వైద్య విద్య ప్రమాణాలు పడిపోతాయని వైద్య విద్యార్థులు పేర్కొంటున్నారు. పాత నిబంధనల ప్రకారం 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులున్న వైద్య కళాశాల ప్రారంభించాలంటే 700 పడకల ఆసుపత్రి ఉండాలి. కానీ దీనిని 300కు కుదించారు. బోధనా సిబ్బంది సంఖ్యను కూడా ప్రస్తుతమున్న సంఖ్య కంటే మూడొంతులు తగ్గించినట్లు తెలిసింది. ఈ నిబంధనల సవరింపును అడ్డం పెట్టుకొని వైద్య కళాశాలలు ప్రస్తుతమున్న సీట్లను రెండింతలు చేసుకునే అవకాశముంది.
‘బిర్లా’లో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు
హైదరాబాద్: జి.పి. బిర్లా ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెట్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఏడాది డిప్లొమా కోర్సు సెప్టెంబర్ నుంచి నిర్వహిస్తున్నట్లు జి.పి. బిర్లా సైన్స్ సెంటర్ డెరైక్టర్ బి.జి.సిద్దార్థ్ వెల్లడించారు. ఈ కోర్సులపై అవగాహనకు 22 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9866082945/ 23241061/ 23235081 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
‘ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్లక్ష్యం లేదు’
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో జరిగిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో శిరీష అనే విద్యార్థినికి నిబంధనల ప్రకారమే ఈ-2 గ్రేడ్ ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ శేషుకుమారి తెలిపారు. ‘ఎస్‌ఎస్‌సీ’ నిర్వాకంతో ఆమెకు నష్టం జరిగిందంటూ మంగళవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆమె స్పందించారు. ఆ విద్యార్థిని లెక్కలు-1 పరీక్షకు హాజరు కాలేదని, లెక్కలు-2 పరీక్ష రాసి సీ-2 గ్రేడ్ సాధించినప్పటికీ ఈ-2 గ్రేడ్ ఇవ్వాలని నిబంధనలున్నట్లు తెలిపారు.
‘ప్రైవేటు’కు తలొగ్గిన ఎంసీఐ?
Published Wed, Aug 19 2015 2:39 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement
Advertisement