దుబాయి: ఈస్టిండియా కంపెనీ.. భారతీయులకు చిరపరిచితమైన పేరు. 1600 సంవత్సరంలో ఇంగ్లండ్‌లో క్వీన్ ఎలిజబెత్ ఇచ్చిన రాయల్ చార్టర్ అనుమతితో ఏర్పడి.. వ్యాపార అవసరాల కోసం మన దేశంలో అడుగుపెట్టి.. దేశాన్నే కొల్లగొట్టిన నేపథ్యం ఆ కంపెనీది. భారత్‌లో జన్మించిన సంజీవ్ మెహతా 2005లో ఆ కంపెనీని కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. లండన్‌లోని మేఫెయిర్‌లో ఆగస్ట్, 2010లో మళ్లీ మొదటి స్టోర్‌ను ఆ కంపెనీ ప్రారంభించింది. అనంతరం ఇంగ్లండ్‌లోనే మరో రెండు దుకాణాలను తెరిచింది. తాజాగా ఖతార్ రాజధాని దోహాలో ఓ స్టోర్‌ను ఈస్టిండియా కంపెనీ ప్రారంభించింది. ఈ కంపెనీకి ఇప్పటికే కువైట్‌లో ఓ స్టోర్ ఉంది. త్వరలోనే సౌదీ అరేబియా, యూఏఈల్లో అమ్మకాలు ప్రారంభించనుంది.
ఇంతకీ ఈ కంపెనీ ఏం అమ్ముతుందంటారా? నాణ్యమైన టీ, కాఫీ పొడులు.. నోరూరించే ఖరీదైన చాక్లెట్లు, బిస్కట్లు.. ప్రత్యేకంగా తయారు చేయించిన స్వీట్లు, జామ్‌లు.. మొదలైనవి ఈ కంపెనీ అమ్మకపు శ్రేణి లో ఉన్నాయి. వాటితో పాటు, నిపుణులైన కళాకారులతో తయారు చేయించిన అత్యంత సుందరమైన, నాణ్యమైన పింగాణీ పాత్రలను కూడా అమ్ముతుంది. వాటిపై నిపుణులైన పెయింటర్లు వేసిన పెయింటింగ్‌లు కూడా ఉంటాయి.