'ఓటర్లకు డబ్బు'పై కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకోండంటూ ఓటర్లకు సలహా ఇచ్చిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు జారీచేసింది. జనవరి 19 మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో గత వారం పర్యటించిన కేజ్రీవాల్ పణజిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. 'బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆమ్‌ఆద్మీ పార్టీకే వేయండి'అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఆప్ అధినేత వ్యాఖ్యలపై ఇతర పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశాయి. దీంతో గోవా ఎన్నికల కమిషన్ కుణాల్.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై రిపోర్టును తయారుచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. రిపోర్టులోని అంశాలను పరిశీలించిన ఈసీఈ.. కేజ్రీవాల్‌ను వివరణకోరింది. సంతృప్తికర సమాధానం రాకుంటే ఈసీ ఎలాంటి చర్యకైనా వెనకాడబోదని గోవా ఎన్నికల కమిషనర్ కుణాల్ సోమవారం మీడియాతో అన్నారు.