ఆర్థిక మాంద్యంలో గల్ఫ్ దేశాలు
రాయికల్ : ఆయిల్ నిల్వల్లో ప్రపంచాన్నే శాసిస్తున్న యూఏఈ, ఖతర్, కువైట్, ఒమన్ దేశాల్లో ఆర్థికమాంద్యం నెలకొంది. గత రెండుమూడు నెలల నుంచి ఆ దేశాలు ఆర్థికమాంద్యంలో కొట్టమిట్టాడుతున్నాయి. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న ఈ దేశాల్లో 2008 నాటి ఆర్థికమాంద్యం మళ్లీ పునరావృతం అవుతోంది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, షార్జా, అలీన్, అజ్మాన్, రసల్‌ఖన స్టేట్స్‌తోపాటు ఖతర్, కువైట్, ఒమన్ దేశాల్లోని చమురు కంపెనీలు తమ భవిష్యత్ ప్రణాళికలను కొంతకాలం రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
దీంతో ఆయూ కంపెనీలపై ఆధారపడిన పరిశ్రమలకు సమస్యలు చుట్టుముట్టాయి. చమురుపై ఆధారపడిన ఆయా దేశాల్లో నిర్మాణరంగం, ఫుడ్‌సప్లై, ట్రాన్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్, టూరిజం తదితర రంగాల్లోని పరిశ్రమలపై ఆర్థికమాంద్యం ప్రభావం అధికంగా ఉంది. చమురు ధరలు తారాస్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్న సమయంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికులు ప్రస్తుతం వేతనాలు తగ్గడంతో తమ జీవన సరళిని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
దుబాయ్ పెట్రోలియం వంటి పెద్ద కంపెనీలు ఎటువంటి నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించడం, జీతాలు తగ్గించడంతో కార్మికులు దినదినగండంగా రోజులు వెల్లదీస్తున్నారు యూఏఈలో గత కొన్నేళ్లుగా స్థిరపడ్డ ఉద్యోగులు తమకు వస్తున్న జీతాల ఆధారంగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకున్నారు. హఠాత్తుగా జీతాలు తగ్గిపోవడంతో తీసుకున్న లోన్లు ఎలా చెల్లించాలో తెలియక క్షోభకు గురవుతున్నారు.
చమురు కంపెనీలతో పాటు వాటిపై ఆధారపడిన మిగతా కంపెనీలు సైతం కార్మికులకు గత రెండుమూడు నెలలుగా జీతాలివ్వకపోవడంతోపాటు, ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంకర్లు సైతం ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో కంపెనీలకు రుణాలు మంజూరు చేయకపోవడం మరొక కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. ఖర్చులను నియంత్రించి ప్రణాళికలు వేసుకుని 2016లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను కొంతవరకు ఎదుర్కోవాలంటే చిన్నతరహా పరిశ్రమలకు మరో ఏడాదిపాటు గడ్డు పరిస్థితి తప్పదని చెబుతున్నారు. కాగా, చిన్నతరహా పరిశ్రమల్లో ఉన్న కార్మికులను సెలవులపై వెళ్లాల్సిందిగా అక్కడి రాజు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
యూఏఈలో 8 లక్షల మందికిపైగా కార్మికులు
ఉన్న ఊరులో ఉపాధి కరువై లక్షల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ తదితర జిల్లాలకు చెందిన ఎనిమిది లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు.
అక్కడ ఆర్థికమాంద్యం ఏర్పడడంతో కంపెనీలు సరైన జీతాలు ఇవ్వకపోవడంతో పాటు పనిలోంచి తొలగించడంతో చేసిన అప్పులు తీర్చలేక స్వగ్రామాలకు తిరిగి రాలేక ఆందోళనకు గురవుతున్నారు. వెనక్కు వచ్చే కార్మికులకు రాష్ట్ర ఉపాధి కల్పించాలని దుబాయ్‌లోని గల్ఫ్ తెలంగాణ సంఘం సభ్యులు జువ్వాడి శ్రీనివాసశర్మ, రాజశ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పరిస్థితులు బాగా లేవు
ఆర్థికమాంద్యం కారణంగా యూఏఈలో గత రెండుమూడు నెలల నుంచి పరిస్థితులు బాగా లేవు. పెద్దపెద్ద కంపెనీల్లో మంచి హోదాల్లో ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు.
- రాజశ్రీనివాసరావు
ప్రభుత్వం ఉపాధి కల్పించాలి
ఆర్థికమాంద్యం వల్ల తెలంగాణకు చెందిన కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ చొరవచూపి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి.
- శ్రీనివాసశర్మ, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం ఫౌండర్ మెంబర్
ఏజెంట్లను నమ్మి రావద్దు
యూఏఈ, ఖతర్, ఒమన్ దేశాల్లో ఆర్థికమాంద్యంతో ఉద్యోగాలు ఊడుతున్నారుు. తెలంగాణ నుంచి నిరుద్యోగులు ఏజెంట్ల మాయమాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు రావద్దు.
- శ్రీనివాసరావు, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు