కట్‌ ఆఫ్‌ డేట్‌ మార్చండి | Gulf victims families plea: Change cut off date in Telangana | Sakshi
Sakshi News home page

కట్‌ ఆఫ్‌ డేట్‌ మార్చండి

Published Fri, Oct 11 2024 4:19 AM | Last Updated on Fri, Oct 11 2024 4:19 AM

Gulf victims families plea: Change cut off date in Telangana

గల్ఫ్‌ బాధిత కుటుంబాల వినతి

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గడచిన పదేళ్ల కాలంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్‌ దేశాల్లో చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తేదీని కట్‌ ఆఫ్‌ డేట్‌గా మారిస్తే వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి లక్షలాది మంది గల్ఫ్‌ దేÔశాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళుతున్నారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకురావడానికి కూడా వారి కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొన్నాయి. అప్పు చేసి గల్ఫ్‌ వెళ్లిన వ్యక్తి చనిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబభారం మోయలేక కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి కట్‌ ఆఫ్‌ డేట్‌ను మార్చాలని పలువురు కోరుతున్నారు.  

ఎడారి దేశాల్లో తెలం‘గానం’
గల్ఫ్‌ దేశాల్లో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమానికి జైకొట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్‌లో బతుకుదెరువుకు వెళ్లి రకరకాల కారణాలతో ఇబ్బందులు పడిన వారికి ప్రభుత్వం సాయం అందించాలనే డిమాండ్‌ ఉంది. అందుకోసం అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేరళ పాలసీని అమలు చేస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. గత ఏడాది డిసెంబర్‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గల్ఫ్‌ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందించేందుకు విధివిధానాలను ఇటీవల వెల్లడించింది. అయితే కట్‌ ఆఫ్‌ డేట్‌ తో చాలా కుటుంబాలకు నిరాశే ఎదురైంది. గడచిన పది నెలల కాలంలో తెలంగాణకు చెందిన వారు గల్ఫ్‌ దేశాల్లో దాదాపు 160 మంది చనిపోయినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.

విధివిధానాలు ఇలా...
ప్రభుత్వం ఈ నెల 7న జారీ చేసిన జీవో 216 ప్రకారం.. చనిపోయిన వ్యక్తి తాలూకు భార్య, పిల్ల లు లేదా తల్లిదండ్రులు మృతుడి డెత్‌ సర్టిఫికెట్, పాస్‌పోర్టు క్యాన్సల్‌ రిపోర్టు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలతో నేరుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకో వాలి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో దరఖాస్తు, సరి్టఫికెట్లను పరిశీలించిన తర్వాత ఆర్థిక సాయం మంజూరవుతుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఓమన్, కత్తర్, సౌదీ అరేబీయా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలకు వెళ్లి చనిపోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2023 డిసెంబర్‌ 7 తర్వాత చనిపోయిన వారు మాత్రమే అర్హులని ఆ జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement