బ్రోకర్ల గుట్టు రట్టు..భారీగా కొత్త నోట్లు స్వాధీనం
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తరువాత భారీగా నమోదవుతున్నఅక్రమ నగదు లావాదేవీల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాత నోట్ల మార్పిడిలో మధ్యవర్తులు, బ్రోకర్లు అక్రమాలకు హద్దు లేకుండా పోతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా వ్యవహరించి అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు. తాజాగా కర్ణాటకలో భారీగా కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నగదు మార్పిడికి పాల్పడుతున్న రాకెట్టును ఛేదించిన ఈడీ అధికారులు ఏడుగురు మధ్యవర్తులను అరెస్టు చేశారు. సుమారు 93 లక్షల రూపాయల స్వాధీనం చేసుకుంది.
నగదు బదిలీ దర్యాప్తులో భాగంగా ఈడీ అరెస్ట్ చేసిన వారిలో ఒక ప్రభుత్వ అధికారి బంధువు సహా ఉన్నారు. రూ .2000ల కొత్త నోట్ల రూ 93 లక్షలను వీరినుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) కింద కేసునమోదు చేశామన్నారు. ఇటీవల ఆదాయపన్నుఅధికారులు 5.7 కోట్ల కొత్త నోట్లనుస్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులుగా కస్టమర్లుగా వ్యవహరించి బ్రోకర్ల గుట్టురట్టు చేశారు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన బ్రోకర్లు పాత నగదు మార్పిడిలో 15-35 శాతం కమిషన్ తీసుకుంటున్నట్టుగా తమ దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. నిందితులను స్థానిక కోర్టులోహాజరపర్చనున్నట్టు చెప్పారు. కమిషన్ తీసుకుంటూ నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు గాను ఒక ముఠాగా ఏర్పడి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందని తెలిపారు.