
ఉద్యోగులను చంపిన సంపాదకుడికి జీవితఖైదు
కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉద్యోగులను చంపిన నేరంలో ఓ సంపాదకుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. త్రిపురలో ఓ బెంగాలీ స్థానిక దినపత్రికకు సంపాదకుడు, యజమాని కూడా అయిన సుశీల్ చౌధురికి స్థానిక కోర్టు ఈ శిక్ష విధించింది. ఇది అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైనదని ఈ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. 'దైనిక్ జ్ఞానదూత్' అనే పత్రిక సంపాదకుడైన 76 ఏళ్ల చౌధురి పాత్ర ఈ నేరంలో ప్రత్యక్షంగా ఉంది కాబట్టి ఆయనకు మరణశిక్ష విధించాలని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన దిలీప్ సర్కార్ వాదించారు. ఉద్యోగులను కాపాడాల్సింది పోయి.. రంజిత్ చౌధురి, బలరాం ఘోష్, సుజిత్ భట్టాచార్జీ అనే ముగ్గురిని ఆయనే చంపాడని సర్కార్ ఆరోపించారు. అయితే, తాను నిర్దోషినని, కనీసం తన వయసు చూసైనా క్షమాభిక్ష పెట్టాలని చౌధురి కోర్టును వేడుకున్నారు.
అయితే.. ''మీరు మగ్గురు ఉద్యోగులను చంపినట్లు రుజువైంది. వాస్తవానికి ఇది ఉరిశిక్ష విధించాల్సిన కేసే గానీ, దోషి వయసును దృష్టిలో పెట్టుకుని ఆయనకు యావజ్జీవ ఖైదు విధిస్తున్నాం. అంటే, ఆయన సహజంగా మరణించేవరకు జైల్లోనే ఉండాలి'' అని పశ్చిమ త్రిపుర అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కృపాంకర్ చక్రవర్తి తన తీర్పులో తెలిపారు. దాంతోపాటు 50 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. గత సంవత్సరం మే 19వ తేదీన పత్రిక కార్యాలయంలోనే ముగ్గురు ఉద్యోగులు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన మానస్ పాల్ 562 పేజీల ఛార్జిషీటు సమర్పించారు.