ప్రచార హోరు!
సాక్షి, చెన్నై : డీఎంకే నేతృత్వంలో ఓ కూటమి , అన్నాడీఎంకే సారథ్యంలో మరో కూటమి, డీఎండీకే- ప్రజా సంక్షేమ నేతృత్వంలో మరో కూటమి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఇక, ఒంటరిగా పీఎంకే, చిన్న పార్టీలతో బీజేపీ ఎన్నికల పయనం సాగిస్తున్నాయి. ఎన్ని కూటములు తెరపైకి వచ్చినా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పోటీ మాత్రం డీఎంకే - అన్నాడీఎంకేల మధ్య అన్నది జగమెరిగిన సత్యం. కొన్ని నియోజకవర్గాల్లో ఆయా కూటములు తమ బలాన్ని చాటుకుని గెలుపునకు తీవ్ర కుస్తీలు పట్టడం సహజం. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకేలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. డీఎండీకే, పీఎంకేలు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.
బీజేపీ 141 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. ఇక, డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ప్రజా సంక్షేమ కూటమిలో ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, తమాకాలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన పార్టీలు ప్రచారాల్లో దూసుకెళుతున్నాయి. తమ అభ్యర్థులకు మద్దతుగా జయలలిత బహిరంగ సభల రూపంలో ఆఘ మేఘాలపై ప్రచారం సాగిస్తున్నారు. మూడు, నాలుగు జిల్లాల్ని కలుపుతూ ఈ బహిరంగ సభలు సాగుతున్నాయి. శుక్రవారం విరుదునగర్‌లో ఆమె అభ్యర్థులను పరిచయం చేసి ప్రసంగించారు.
అరుప్పుకోట్టై జయలలిత హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం విశేషం. విరుదునగర్ వేదికగా సాగిన ప్రచారంలో డీఎంకేపై తీవ్రంగా విరుచుకు పడ్డ జయలలిత, జాలర్ల సంక్షేమం లక్ష్యంగా హామీలు గుప్పించారు.
స్టైలిష్ ‘స్టాలిన్’: మనకు ...మనమే అంటూ ఇటీవల డిఎంకే దళపతి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో స్టైలిష్‌గా స్టాలిన్ అవతారం ఎత్తారు. రాజకీయ నాయకుడిగా కాకుండా, మీలో ఒక్కడిని అంటూ ఆయన రంగు రంగు చొక్కాలతో , జీన్స్‌ప్యాంట్, షర్టులతో ప్రత్యక్షం అయ్యారు. అదే తరహాను అనుసరిస్తూ ఎన్నికల ప్రచారంలోనూ స్టాలిన్ ముందుకు సాగుతున్నారు. మదురై వేదికగా శుక్రవారం సాయంత్రం నాలుగుగంటలకు తన ఎన్నికల ప్రచారానికి స్టాలిన్ శ్రీకారం చుట్టారు.
మేలూరు, మదురై, ఆరవపాళయం, పలంగానత్తం, తిరుప్పరగుండ్రం, చోళ వందాన్, తిరుమంగళం వైపుగా రోడ్ షో రూపంలో ఆయన ప్రచార వాహనం దూసుకె ళ్లింది. జన సందోహం అత్యధికంగా గుమికూడిన ప్రదేశాల్లో పది , పదిహేను నిమిషాలు ప్రసంగిస్తూ, డీఎంకే మేనిఫెస్టోలోని అంశాలు ప్రజల మదిలో ముద్ర పడే విధంగా తన ప్రసంగాన్ని సాగించారు.
అభ్యర్థులు ప్రచారం : డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే అభ్యర్థులుప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒపెన్ టాప్ జీపుల్లో కొందరు, వాడ వాడల్లో పాదయాత్రతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కరపత్రాల పంపిణీతో ఓటర్ల మద్దతునుసేకరిస్తున్నారు. ఇక, డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ తిరుత్తణిలో ప్రచారం నిర్వహించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో డీఎంకే, అన్నాడీఎంకేలకు వ్యతిరేకంగా విరుచుకు పడ్డారు. ఇక, ఆయన సతీమణి ప్రేమలత రోడ్ షో రూపంలో ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు.
తాను ఎన్నికల రేసులో లేదంటూ తమాకా నేత జీకేవాసన్ ప్రకటించగా, వారం తర్వాత ఎన్నికల ప్రచారం సాగిస్తానని పేర్కొన్నారు. ఇక, ఎండీఎంకే నేత వైగో శనివారం నుంచి నిర్విరామంగా రోడ్ షోల రూపంలో ప్రచారంలో ఉరకలు తీయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ విరుగంబాక్కంలో, ఉపాధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కోయంబత్తూరులో, జాతీయ కార్యదర్శి హెచ్ రాజ టీనగర్‌లో పాదయాత్రల రూపంలో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
తిరుగు బాటు సెగ: డీఎంకే, అన్నాడీఎంకేలో కొన్ని చోట్ల అభ్యర్థులకు వ్యతిరేకంగా తిరుగు బాటు హోరెత్తుతున్నది. అనైకట్టు, జోళార్ పేట, శీర్గాలి, అరంతాంగి, ఆలంకుడి, సేలం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ ఆయా ప్రాంతాల్లోని డిఎంకే వర్గాలు పోరు బాటు సాగించే పనిలో పడ్డారు. ఆయా ప్రాంతాల్లోని తమ తమ కార్యాలయాన్ని ముట్టడించి నిరసనలకు దిగారు. కొన్ని చోట్లు పరస్పరం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి.
ఇక, కొందరు అయితే, ఏకంగా చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసం ముట్టడికి యత్నించారు. ఇక, అన్నాడీఎంకేలోనూ ఇదే రగడ. తిరువణ్ణామలై అభ్యర్థిని మార్చాలంటూ అక్కడి నాయకులు రాయపేటలోని ఆ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసనకు దిగారు. అలాగే, ఎన్నికల ప్రచారాల్లో ఉన్న ముఖ్య నాయకులకు ఈ సెగ తప్పడం లేదు. మంత్రి కేసీ వీరమణిని కేవికుప్పంలో అభ్యర్థిని మార్చాలంటూ ఆ పరిసర వాసులు చుట్టుమట్టడంతో ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు. ఈ వ్యతిరేకతను చల్లార్చేందుకు ఆయా జిల్లాల్లోని నేతలు అధిష్టానం ఆదేశంతో రంగంలోకి దిగారు.