ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకుంటాం: చైనా
బీజింగ్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు చైనా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. వన్-చైనా పాలసీపై జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు చైనీస్ ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్ టైమ్స్ లో కథనం ప్రచురించింది.
తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ఆదివారం అమెరికాలో ప్రత్యక్షం కావడంతో చైనా మరోసారి మండిపడింది. మధ్య అమెరికాలు దేశాలు హోండురస్, నికారాగువా, గ్వటెమాలా, ఈఐ సాల్వడార్ పర్యటనకు వెళుతూ సాయ్ ఇంగ్ వెన్.. ఫ్లోరిడాలో ఆగారు. రిపబ్లికన్ పార్టీ నాయకులతో ఆమె భేటీ అయ్యారు. సాయ్ ఇంగ్ వెన్ తో సమావేశమైన ఫొటోను టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ట్విటర్ లో ఫోస్ట్ చేశారు. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ తోనూ ఆమె చర్చలు జరిపారు. సాయ్ ఇంగ్ వెన్ ను అమెరికాలో అడుగుపెట్టనీయరాదని వాషింగ్టన్ ను చైనా కోరింది. వన్-చైనా పాలసీ కింద ఎటువంటి అధికారిక సమావేశాలు జరిపే అధికారం తైవాన్ అధ్యక్షురాలికి లేదని చైనా పేర్కొంది.
‘అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వన్-చైనా పాలసీపై ట్రంప్ జోక్యం చేసుకుంటే ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని చైనా ప్రజలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎటువంటి బేరసారాలకు తావులేద’ని గ్లోబల్ టైమ్స్ రాసింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ తో దౌత్యసంబంధాలు పునరుద్ధరిస్తానని ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించడంతో చైనా ఉలిక్కిపడుతోంది. తైవాన్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తోంది.