ఆకాశంలో విమానం ఇంజిన్ ఫెయిల్
పెర్త్: ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్ వెళుతున్న విమానంలో ఓ ఇంజిన్ ఫెయిలయింది. ఆ విమానాన్ని వెంటనే ఇండోనేసియా వైపు దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం రాత్రి హాంకాంగ్కు చెందిన రెండు ఇంజిన్ల కాథే పసిఫిక్ ఎయిర్బస్ ఏ 330 .. 254 మంది ప్రయాణికులతో పెర్త్ నుంచి బయల్దేరింది. కాసేపటి తర్వాత ఓ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. విమానాన్ని వెంటనే ఇండోనేసియాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. విమానంలో మంటలు చెలరేగినపుడు బిగ్గరగా శబ్దం వచ్చిందని, విమానం ఊగిందని ప్రయాణికుడు జొయెల్ సిర్నా చెప్పారు. విమానంలో లైట్లు ఆరిపోయాయని, రెక్క భాగంలో మంటలు చెలరేగాయని వివరించారు. అయితే మంటలు చెలరేగలేదని, ఇంజిన్ ఫెయిలయిందని విమానయాన వర్గాలు తెలిపాయి.