వంద శాతం ఈక్విటీ ఫండ్స్ ఉంటాయా? | Equity Linked Savings Scheme | Sakshi
Sakshi News home page

వంద శాతం ఈక్విటీ ఫండ్స్ ఉంటాయా?

Published Mon, Apr 27 2015 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

వంద శాతం ఈక్విటీ ఫండ్స్ ఉంటాయా?

వంద శాతం ఈక్విటీ ఫండ్స్ ఉంటాయా?

వంద శాతం ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) కంటే ఇవి అధిక రాబడులను  ఇస్తాయా?
 - హాసిని, తిరుపతి

 
 చాలా ఈక్విటీ ఫండ్స్  తమ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి.  ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ కూడా  దాదాపు వంద శాతం ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌కు, ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌కు తేడా ఒక్కటే. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. అందుకని ఈ ఫండ్ మేనేజర్ ఈఎల్‌ఎస్‌ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తాన్ని ఈక్విటీల్లోనే మూడేళ్లపాటు ఉంచుతారు. ఈక్విటీ ఫండ్స్‌కు ఆ లాకిన్ పీరియడ్ ఉండదు. ఇక రాబడుల విషయానికొస్తే, దీర్ఘకాలం క్రమం తప్పకుండా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.
 
 నేను క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను.  మ్యూచువల్ ఫండ్స్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉన్నా యా? నేను డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
  - శివప్రసాద్, గుంటూరు

 డెట్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలే. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ) దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్లలాగానే ఉంటాయి. తేడా ఒక్కటే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి గడువుకు ముందుగానే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఎఫ్‌ఎంపీలో అలా వీలు లేదు. కాకుంటే ఎఫ్‌ఎంపీలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులనిస్తాయి. ఇక సేవింగ్స్ డిపాజిట్స్ కంటే లిక్విడ్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం.
 
 నా వయస్సు 28 సంవత్సరాలు. పన్ను ఆదా చేసే ఉద్దేశంతో రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీనికి అదనంగా మరో 50 వేల వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఈక్విటీల్లో మదుపు చేయమంటారా?
  లేక నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? వివరించండి.
 - ఆనంద్, హైదరాబాద్

 
 28 సంవత్సరాలున్న మీరు 30 ఏళ్లపాటు (మీరు రిటైరయ్యేంత వరకూ) మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందగలరు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఈక్విటీ కేటాయింపులు గరిష్టంగా 50 శాతం మాత్రమే ఉంటాయి. అదే ఈక్విటీ ఫండ్స్‌లో అయితే ఈక్విటీ కేటాయింపులు వంద శాతంగా ఉంటాయి. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అదే ఎన్‌పీఎస్ వల్ల పన్ను ప్రయోజనాలున్నాయి. మీరు కనుక ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం పన్ను బాధ్యత కొంత వరకూ తగ్గుతుంది. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి.
 
 నేను హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200 ఫండ్‌లో గత కొంత కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడులు అం తంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమంటారా? - పవన్, వరంగల్

 హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200 ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గత 2,3 ఏళ్లుగా ఈ ఫండ్ పనితీరు బాగా లేకపోయినప్పటికీ, మరీ నిరాశౠజనకంగా లేదని చెప్పొచ్చు. మీరు ఓపిక పడితే మంచి రాబడులే పొందొచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి.
 
 నా వయస్సు 45 సంవత్సరాలు. నేను నెలకు రూ. 1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? మీ అభిప్రాయం చెప్పండి ?
 - రామాంజనేయులు, విశాఖపట్టణం

 
 మీ వయస్సు 45 ఏళ్లు. కాబట్టి మీరు ఎన్‌పీఎస్‌ను ఎంచుకుంటే 13 ఏళ్ల పాటు ఆ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయెచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 40 శాతాన్ని యొన్యూటీగా కన్వర్ట్ చేస్తారు. మీరు తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు పన్ను లాంటి బాదరబందీలేమీ ఉండవు. ఈ స్కీమ్ లో ఈక్విటీలకు కేటాయించేది గరిష్టంగా 50% మాత్రమే. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో 8-10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయండి. ఒక విధంగా మీకు ఇది పెన్షన్ ప్లాన్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇక మీరు రిటైరయ్యే 2-3 ఏళ్ల ముందు ఈ ఫండ్‌లో జమ అయిన మొత్తాన్ని ఏదైనా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్‌లోకి మార్చుకోండి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement