గ్రీసు బెయిలవుట్ కు ఈయూ ఓకే
లండన్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రీసు దేశానికి ఊరట లభించింది. గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీకి యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలు ఓకే చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం మూడో ఉద్దీపన ప్యాకేజీకి ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్టు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. గ్రీసుకు బెయిలవుట్ ప్యాకేజీ సిద్ధంగా ఉందని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ప్యాకేజీ వివరాలు వెల్లడి కాలేదు.
'సీరియస్ సంస్కరణలు, ఆర్థిక సహాయం'గా బెయిలవుట్ ప్యాకేజీని బీబీసీ పేర్కొంది. బెయిలవుట్ ప్యాకేజీ ప్రతిపాదనలకు గురువారం రాత్రి గ్రీసు కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 50 బిలియన్ యూరోల బెయిలవుట్ ప్యాకేజీని కోరుతూ 13 బిలియన్ యూరోల మేర పెన్షన్ సంస్కరణలు, వ్యయాల కోత, పన్నుల పెంపు వంటివి అమలుచేయడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ గ్రీసు ప్రతిపాదనల్ని రూపొందించిందని అనధికార వార్తలు వచ్చాయి.