గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Jul 20 2015 1:36 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM

Last week Business

గ్రీస్ బెయిలవుట్‌కు యూరోజోన్ ఓకే
 యూరోజోన్ నేతలు బెయిలవుట్ ప్యాకేజీకి  అంగీకరించారు. మూడేళ్లపాటు అమలయ్యేలా 86 బిలియన్ యూరోల(దాదాపు 96 బిలియన్ డాలర్లు) బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వటానికి సమ్మతించారు. దీన్ని పొందటానికి పెట్టిన షరతులకు గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. 2010 నుంచి ఇప్పటివరకూ ఐఎంఎఫ్, ఈయూలు 240 బిలియన్ యూరోల విలువైన రెండు ప్యాకేజీలను ఇచ్చాయి.
 
 స్టార్టప్‌ల ఫండ్‌కి రూ.2,000 కోట్లు

 స్టార్టప్ సంస్థల్లో ఈక్విటీ పెట్టుబడులు పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కోసం చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) రూ.2,000 కోట్లు కేటాయించింది. స్టార్టప్స్‌కి తోడ్పాటునిచ్చేందుకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.10,000 కోట్ల నుంచి ఈ 2,000 కోట్లను ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కి ఇస్తారు. మిగతా 8,000 కోట్లను తక్కువ వడ్డీ రుణాల కింద ఇస్తారు.

 ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్టులపై జీఎంఆర్ దృష్టి
 ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్టులపై జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రత్యేకంగా దృష్టిసారిం చింది. అక్కడ అభివృద్ధి చేయదల్చిన ఐదు ఎయిర్‌పోర్టుల కాంట్రాక్టులను భాగస్వామ్య కంపెనీతో కలిసి దక్కించుకోవడానికి జీఎంఆర్ ప్రయత్నాలు చేస్తోంది. రూ.15,000 కోట్లతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలనుకున్న ఈ ఎయిర్‌పోర్టుల కోసం 6 కంపెనీలు పోటీ పడుతున్నట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో జీఎంఆర్-మెగావైడ్ కంపెనీ కూడా ఉంది.
 
 ఈ నెల 29న విండోస్-10
 సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ లేటెస్ట్ వెర్షన్ విండోస్-10ను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో ఆవిష్కరించనుంది. ఈ జాబితాలో న్యూయార్క్ సిటీ, సిడ్నీ, టోక్యో, బీజింగ్ తదితర నగరాలతో పాటు న్యూఢిల్లీ కూడా ఉంది. ఇతర విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారు కొత్త వెర్షన్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు పరిమిత కాలం పాటు మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఇస్తోంది.

 పెబ్స్ పెన్నార్ ఐపీవోకి సెబీ అనుమతి
 పెన్నార్ గ్రూపునకు చెందిన ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్  కంపెనీ పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూకి సెబీ ఆమోదం తెలిపింది. తొలి పబ్లిక్ ఇష్యూకి జూలై 10న సెబీ తుది అనుమతులిచ్చింది. ఆగస్టు చివరి వారంలో కంపెనీ ఐపీవోకి వస్తుందని సమాచారం. ఐపీవో ధరనింకా నిర్ణయించలేదని, ఇష్యూ ద్వారా కనీసం రూ. 150 కోట్లు సమీకరించే అవకాశం ఉందని  కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. పెబ్స్ పెన్నార్ కంపెనీ విలువను రూ.500 నుంచి రూ.600 కోట్లుగా మదింపు చేశారు.
 
 క్రెడిట్ కార్డ్ నిబంధనలు కఠినతరం
  క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ నిబంధనావళిని ఆర్‌బీఐ కఠినం చేసింది. పేమెంట్ బకాయి నిర్దేశిత సమయంకన్నా మూడు రోజులు దాటితే... కార్డ్ వినియోగదారులపై లేట్ ఫీజు విధించాలని, క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది. బకాయి తేదీ నుంచి 90 రోజుల లోపు ‘బకాయి కనీస మొత్తం’ చెల్లించకపోతే... క్రెడిట్ కార్డ్‌ను ‘మొండి బకాయి పదు’్ద(ఎన్‌పీఏ)గా పరిగణించాలని తెలిపింది.

 పిపావవ్‌లో అడాగ్ మరిన్ని పెట్టుబడులు
 భారతీయ నేవీ అవసరాలన్నింటికీ ఉపయోగపడేలా పిపావవ్ షిప్‌యార్డును తీర్చిదిద్దేందుకు మరో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు.
 
 భెల్‌కు యుద్ధ సామగ్రి తయారీ లెసైన్స్
 నౌకాదళానికి అవసరమయ్యే యుద్ధ సామగ్రిని తయారు చేసేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ దిగ్గజాలకు కేంద్రం లెసైన్సులిచ్చింది. వీటిలో లార్సన్ అండ్ టూబ్రో, పిపావవ్, భెల్, ఏబీజీ షిప్‌యార్డ్, అల్ఫా డిజైన్ టెక్నాలజీస్ సంస్థలున్నాయి.

 పసిడి టారిఫ్‌లను తగ్గించిన కేంద్రం
 పసిడి, వెండి టారిఫ్ విలువను కేంద్రం తగ్గించింది. 10 గ్రాముల పసిడి టారిఫ్ విలువ 382 డాలర్ల నుంచి 376 డాలర్లకు తగ్గింది. కేజీ వెండి టారిఫ్ విలువ 516 డాలర్ల నుంచి 498 డాలర్లకు తగ్గింది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువే ప్రాతిపదిక.
 
 ఈ ఏడాదే ఫెడ్ రేటు పెంపు
 ఆర్థిక వ్యవస్థ అనుకున్న ఫలితాలను సాధిస్తే... ఈ ఏడాది చివరికల్లా వడ్డీరేటు పెంపు ఖాయమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ ఎలెన్ బుధవారం స్పష్టం చేశారు.
 
 డీల్స్
 హెచ్‌సీఎల్ టెక్ అమెరికాకు చెందిన ఐటీ కంపెనీ ట్రిగ్‌స్టడ్ టెక్నికల్ సర్వీసెస్ ఆస్తుల్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది. డీల్ వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో హెచ్‌సీఎల్ తన పెద్ద సాఫ్ట్‌వేర్ వెండర్లకు నాణ్యమైన సేవలను అందించనుంది. ట్రిగ్‌స్టడ్‌కు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటె లిజెంట్ సిస్టమ్స్, కోర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉంది.

  రక్షణ అవసరాలకు కావల్సిన విమానాల తయారీకి బోయింగ్‌తో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) ఒప్పందం కుదుర్చుకుంది.  రెండు సంస్థలు కలిసి మానవరహిత విమానాలతో పాటు, రక్షణ రంగానికి చెందిన విమానాలను అభివృద్ధి చేస్తాయి.

  సువెన్ లైఫ్ సెన్సైస్ అభివృద్ధి చేసిన నాడీమండల సంబంధిత వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఔషధాలకు చైనా, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాల నుంచి అనుమతి లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement