లొంగిపోయిన సోమనాథ భారతి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి బుధవారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనపై భార్య పెట్టిన గృహహింస, హత్యాయత్నం కేసులో పోలీసుల విచారణకు ఆయన పూర్తి స్థాయిలో సహకరించాలని నిర్ణయించుకొని నేరుగా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం ఈ కేసుకు సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కోర్టు కూడా ఆయనను గురువారం వరకు అరెస్టు చేయొద్దని చెప్పింది.
అయితే, అరెస్టుకు మరో రోజు గడువు ఉండగానే అంతకంటే ముందే సోమనాథ్ భారతి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడం చర్చనీయాంశమైంది. గత రాత్రి తన పార్టీ నేతలతో ఈ విషయం సుధీర్ఘంగా చర్చించగా నేరుగా పోలీసుల ముందుకు వెళ్లి విచారణకు హాజరుకావడం మంచిదని సూచించిన నేపథ్యంలో ఆయన స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. ఒక వేళ పోలీసులు సోమనాథ్ ను అరెస్టు చేస్తే గడిచిన నెలలో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో నాలుగో అరెస్టుగా నిలుస్తుంది. అంతకుముందు ఆప్ ఎమ్మెల్యేలు జితేంద్ర సింగ్ తోమర్, మనోజ్ కుమార్, సురేందర్ సింగ్ పలు కేసుల్లో అరెస్టయ్యారు.