domestic abuse case
-
నాకు గన్‌మన్‌తో భద్రత కల్పించండి: షమీ
న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ తనకు భద్రత కోసం గన్‌మన్‌ను నియమించాలని అమ్రోహ జిల్లా మేజిస్ట్రేట్‌ను కోరాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా తనకు భద్రత కల్పించాలని విన్నవించాడు. ప్రధానంగా తన భార్య హసిన్తో ప్రాణహాని ఉందని తెలిపాడు. ఈ మేరకు భార్య నుంచి ఇప్పటికే బెదిరింపులు వచ్చినట్లు మేజిస్ట్రేట్ కు తెలిపినట్లు సమాచారం. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది నెలల క్రితం భార్య హాసిన్ జహాన్‌తో మొదలైన వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని షమిపై జహాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీసీసీఐపై కూడా నిందలు వేయడం మొదలుపెట్టారు. అసలు షమీపై బీసీసీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. అయితే నిజాలు తేల్చుకునేందుకు బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టింది. షమీ నిర్దోషిగా తేలడంతో బీసీసీఐ అతనిపై క్లీన్ చిట్ విడుదల చేసింది. ఇక ఆ తర్వాత తనకు.. సంతానానికి పోషణ నిమిత్తం ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ మరోసారి షమీపై కేసు నమోదు చేసింది. దానికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకుముందు ఆమె చేసిన అప్పీలులో నెలకు రూ.10లక్షలు కావాలంటూ డిమాండ్ చేసింది. -
గృహహింస కేసు.. షమీకి సమన్లు
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. తాజాగా షమీకి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీచేశారు. గృహహింస చట్టం 2005 కింద షమీ భార్య హసీన్ జహాన్ అలీపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ షమీకి పోలీసులు సమన్లు పంపారు. షమీతోపాటు అతని సోదరుడు హసీబ్ అహ్మద్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. హసీన్ జహాన్‌కు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. కేసులు వేసిన తర్వాత రూ. లక్ష ఓ చెక్ ఇస్తే.. అది కూడా బౌన్స్ అయిందని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. హసీన్ ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం రూ. 7 లక్షలు, కుమార్తె ఐరా ఖర్చుల కోసం మరో రూ. 3 లక్షలు షమీ నుంచి భరణంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేపట్టాలని కోల్‌కతా పోలీసులను అలీపూర్ కోర్టు ఆదేశించింది. షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేసింది విదితమే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం షమీ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
మరో మలుపు తిరిగిన షమీ వ్యవహారం
కోల్‌కతా : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సాయం తీసుకోవాలని షమీ భార్య హసిన్ జహాన్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘ప్రస్తుతం మా న్యాయవాది బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవహారం ఇక్కడితో తేలకపోతే రేపు భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేసే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఇది బోర్డు పరిధిలోనే జరిగి ఉంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే బీసీసీఐనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వ్యవహారానికి ముగింపు పలికే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందని.. ఈ మేరకు జహాన్‌కు రాజీ ప్రతిపాదన పంపిందన్న మరో కథనం వినిపిస్తోంది. మరోవైపు ఈ ఉదయం షమీపై కోల్‌కతా లో ఎఫ్ఐఆర్ నమోదు అయిన సంగతి తెలిసిందే. గృహ హింసా చట్టం కింద కేసు నమోదుకాగా.. భార్య జహాన్‌ను వేధించటం.. రేప్ అటెంప్ట్.. హత్యాయత్నం, వివాహేతర సంబంధాలు తదితర ఆరోపణలు అతనిపై వినిపిస్తున్నాయి. -
భరించాల్సిన బాధ్యత భర్తదే..
బాగోగులతో అత్తమామలకు సంబంధం లేదు: ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ: భర్త నుంచి మాత్రమే వసతి, నిర్వహణ సౌకర్యం పొందే హక్కు భార్యకు ఉంటుందని, అత్త, మామలకు ఎలాంటి సంబంధం ఉండదని ప్రత్యేక కోర్టు వెల్లడించింది. ఒక గృహహింస కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి అనిల్‌కుమార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక మహిళ వివాహం చేసుకొని తన భర్త, అత్తమామలతో నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో నివాసం ఉండేది. అయితే మనస్పర్థల కారణంగా అత్తమామలు కొడుకు, కోడలిని బయటకు పంపారు. ఈ క్రమంలో ఆ మహిళ తన వసతి, నిర్వహణ ఖర్చులు అత్తమామలు భరించాలంటూ ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోడలికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆమె అత్త సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. తన ఆస్తిలో కోడలికి నివాసం కల్పించడం కుదరదని, అ బాధ్యత కేవలం ఆమె భర్తపైనే ఉంటుందంటూ వాదించింది. ఈ వాదనతో ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. -
కోర్టు ప్రాంగణంలోనే..బ్లేడ్‌తో భార్య గొంతు కోసిన భర్త
♦ దాడి తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు ♦ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న భార్య హైదరాబాద్: కోర్టు ప్రాంగణంలోనే బ్లేడ్‌తో భార్య గొంతు కోసి పారిపోయాడు ఓ భర్త! రక్తసిక్తమై పడిపోయిన ఆమెను కోర్టు సిబ్బంది, పోలీసులు ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోంది. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్‌హౌజ్‌కు చెందిన సౌజన్యకు పాతబస్తీ చత్రినాక ప్రాంతానికి చెందిన నాగేందర్‌తో 8 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. చెడు అలవాట్లకు బానిసైన నాగేందర్ జులాయిగా తిరుగుతూ ఇంటి వద్దే ఉండేవాడు. వివాహం అనంతరం ఆర్నెళ్ల పాటు సాఫీగా సాగిన వీరి జీవితంలో తర్వాత గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం నాగేందర్ వేధించాడు. ఎన్నోసార్లు పంచాయితీ పెట్టి పెద్దలతో చెప్పించినా మారలేదు. దీంతో సౌజన్య 2012లో చత్రినాక పోలీస్ స్టేషన్లో గృహహింస చట్టం కింద భర్తపై కేసు పెట్టింది. అయినా భర్తలో మార్పు రాకపోవడంతో తన కొడుకును లంగర్‌హౌజ్ వెళ్లిపోయింది. నాగేందర్ అక్కడికి కూడా వెళ్లి వేధించడంతో ఆమె లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఉప్పర్‌పల్లి కోర్టులో కేసు నడుస్తోంది. ప్రతినెల మాదిరే నాగేందర్ సోమవారం కూడా కోర్టుకు హాజరయ్యాడు. సౌజన్యకు ప్రతినెల రూ.2 వేలు చెల్లించాలని కోర్టు గతంలోనే తెలిపింది. కానీ కొన్ని నెలలు గా నాగేందర్ చెల్లించడం లేదు. సోమవారం ఇద్దరూ కోర్టు లోపలికి వెళ్లారు. విచారణ తర్వాత సౌజన్య బయటకి రావడంతో నాగేందర్ అప్పటికే తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు. గొంతుపై కోయడంతో సౌజన్య కుప్పకూలిపోయింది. పోలీసులు, కోర్టు సిబ్బంది వెంటనే గమనించి ఆస్పత్రికి తరలించారు. దాడి తర్వాత నాగేందర్ అక్కడ్నుంచి పారిపోయి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విషయం తెలియడంతో సౌజన్య తల్లి మాధవి, సోదరి చైతన్య ఆసుపత్రికి వచ్చారు. పెళ్లి నాటి నుంచి అదనపు కట్నం, అనుమానంతో తమ కూతురును నాగేందర్, ఆయన కుటుంబీకులు వేధించేవారని చెప్పారు. -
లొంగిపోయిన సోమనాథ భారతి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి బుధవారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనపై భార్య పెట్టిన గృహహింస, హత్యాయత్నం కేసులో పోలీసుల విచారణకు ఆయన పూర్తి స్థాయిలో సహకరించాలని నిర్ణయించుకొని నేరుగా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం ఈ కేసుకు సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కోర్టు కూడా ఆయనను గురువారం వరకు అరెస్టు చేయొద్దని చెప్పింది. అయితే, అరెస్టుకు మరో రోజు గడువు ఉండగానే అంతకంటే ముందే సోమనాథ్ భారతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం చర్చనీయాంశమైంది. గత రాత్రి తన పార్టీ నేతలతో ఈ విషయం సుధీర్ఘంగా చర్చించగా నేరుగా పోలీసుల ముందుకు వెళ్లి విచారణకు హాజరుకావడం మంచిదని సూచించిన నేపథ్యంలో ఆయన స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. ఒక వేళ పోలీసులు సోమనాథ్ ను అరెస్టు చేస్తే గడిచిన నెలలో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో నాలుగో అరెస్టుగా నిలుస్తుంది. అంతకుముందు ఆప్ ఎమ్మెల్యేలు జితేంద్ర సింగ్ తోమర్, మనోజ్ కుమార్, సురేందర్ సింగ్ పలు కేసుల్లో అరెస్టయ్యారు. -
'నాపై కక్షతో నా భార్యను ఉపయోగిస్తున్నారు'
న్యూఢిల్లీ: తన కేసు విషయంలో ఢిల్లీ పోలీసులు గాలి, శబ్ధంకంటే వేగంగా(సూపర్ సోనిక్ స్పీడ్) దూసుకెళుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి ఆరోపించారు. వారు ప్రతి కేసులోనూ ఇదే వేగంతో పనిచేస్తే ఢిల్లీ మొత్తం నేర రహిత మహానగరంగా అనతి కాలంలోనే సాధ్యమవుతుందని అన్నారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి వారు మితిమీరిన అత్యుత్సాహంతో పనిచేస్తున్నారని దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. తనపై రాజకీయంగా కక్ష తీర్చుకోవాలని తన భార్యను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తనను గృహహింసకు గురిచేయడంతోపాటు హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని సోమనాథ్ భారతిపై ఆయన భార్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును పోలీసులు గత ఐదు రోజుల కిందే నమోదు చేశారు. జూలైలోనే ఆమె ఫిర్యాదు చేసినా తొలుత వారిద్దరి మధ్య సంప్రదింపులు జరిపిన పోలీసులు ఫలితం లేకపోవడంతో చివరకు సోమనాథ్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వని కారణంగా పోలీసులు అరెస్టు చేయడానికి అడ్డంగి తొలిగినట్లయింది.