కోర్టు ప్రాంగణంలోనే..బ్లేడ్‌తో భార్య గొంతు కోసిన భర్త
♦ దాడి తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు
♦ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న భార్య
హైదరాబాద్: కోర్టు ప్రాంగణంలోనే బ్లేడ్‌తో భార్య గొంతు కోసి పారిపోయాడు ఓ భర్త! రక్తసిక్తమై పడిపోయిన ఆమెను కోర్టు సిబ్బంది, పోలీసులు ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోంది. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్‌హౌజ్‌కు చెందిన సౌజన్యకు పాతబస్తీ చత్రినాక ప్రాంతానికి చెందిన నాగేందర్‌తో 8 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. చెడు అలవాట్లకు బానిసైన నాగేందర్ జులాయిగా తిరుగుతూ ఇంటి వద్దే ఉండేవాడు. వివాహం అనంతరం ఆర్నెళ్ల పాటు సాఫీగా సాగిన వీరి జీవితంలో తర్వాత గొడవలు మొదలయ్యాయి.
అదనపు కట్నం కోసం నాగేందర్ వేధించాడు. ఎన్నోసార్లు పంచాయితీ పెట్టి పెద్దలతో చెప్పించినా మారలేదు. దీంతో సౌజన్య 2012లో చత్రినాక పోలీస్ స్టేషన్‌లో గృహహింస చట్టం కింద భర్తపై కేసు పెట్టింది. అయినా భర్తలో మార్పు రాకపోవడంతో తన కొడుకును లంగర్‌హౌజ్ వెళ్లిపోయింది. నాగేందర్ అక్కడికి కూడా వెళ్లి వేధించడంతో ఆమె లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఉప్పర్‌పల్లి కోర్టులో కేసు నడుస్తోంది. ప్రతినెల మాదిరే నాగేందర్ సోమవారం కూడా కోర్టుకు హాజరయ్యాడు. సౌజన్యకు ప్రతినెల రూ.2 వేలు చెల్లించాలని కోర్టు గతంలోనే తెలిపింది. కానీ కొన్ని నెలలు గా నాగేందర్ చెల్లించడం లేదు.
సోమవారం ఇద్దరూ కోర్టు లోపలికి వెళ్లారు. విచారణ తర్వాత సౌజన్య బయటకి రావడంతో నాగేందర్ అప్పటికే తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు. గొంతుపై కోయడంతో సౌజన్య కుప్పకూలిపోయింది. పోలీసులు, కోర్టు సిబ్బంది వెంటనే గమనించి ఆస్పత్రికి తరలించారు. దాడి తర్వాత నాగేందర్ అక్కడ్నుంచి పారిపోయి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలియడంతో సౌజన్య తల్లి మాధవి, సోదరి చైతన్య ఆసుపత్రికి వచ్చారు. పెళ్లి నాటి నుంచి అదనపు కట్నం, అనుమానంతో తమ కూతురును నాగేందర్, ఆయన కుటుంబీకులు వేధించేవారని చెప్పారు.