ఇక మీ ఫోన్ డేటా.. పర్సుకి భద్రత
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్ వినియోగదారులకు కొత్త బాధలు తీసుకొచ్చిందా అంటే అవుననే అంటున్నారు పలువురు నెటిజన్లు. ఇందుకు ప్రధాన కారణం ఫేస్బుక్ లోని టైం లైన్లోని వీడియోలేనట. వీటి కారణంగా తాము మొబైల్ ఫోన్లలో వేసుకునే డేటా వేగంగా అయిపోవడమే కాకుండా వారి పర్సులు ఖాళీ అయిపోతున్నాయని వాపోతున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఈ మధ్య బాగా ఎక్కువై పోయాయి కూడా.
ఒక్కసారి ఫేస్ బుక్ ఓపెన్ చేశాక అందులోని వీడియోలు మనం క్లిక్ చేసినా చేయకపోయినా వాటంతటవే బఫరింగ్ కావడం ఆ క్రమంలో డేటా మొత్తం అయిపోవడం తిరిగి డేటా కోసం డబ్బులు వెచ్చించడం ఒక విధిగా మారినట్లు వినియోగదారులు చెప్తున్నారు. నెల రోజులకోసం ఫోన్లలో వేయించుకున్న 500 ఎంబీ, 1జీబీ డేటా కూడా రెండు మూడు రోజుల్లో ఈ వీడియోల కారణంగా అయిపోతుందని అంటున్నారు. అయితే, ఈ సమస్యకు ఫేస్ బుక్ తాజాగా చెక్ పెట్టింది. ఫేస్బుక్లోకి వెళ్లగానే ఆటో ప్లేయింగ్ వీడియోస్ స్విచ్ఛాఫ్ చేసేలా అవకాశాన్నిచ్చింది. యూట్యూబ్ కంటే వేగంగా ఫేస్బుక్లో వీడియోలు అపలోడ్ అవుతున్న కారణంగా ప్రతి ఒక్కరు ప్రస్తుతం వీడియో అప్లోడ్లు ఎక్కువగా చేస్తున్నారు.