ఆరు రోజులైనా తీరని వేదన!
సాక్షి, హైదరాబాద్: అవే కన్నీళ్లు.. అదే ఆవేదన.. బిడ్డ బతికి వస్తాడన్న ఆశతో ఎదురుచూస్తున్న వారు కొందరు.. కనీసం కడసారి చూపుకైనా నోచుకుంటామా అని గుండెలవిసేలా రోదిస్తున్నవారు మరికొందరు..! హిమాచల్ దుర్ఘటనకు శుక్రవారంతో ఆరు రోజులు అవుతున్నా తల్లిదండ్రుల శోకం తీరలేదు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం శుక్రవారం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. ఆర్మీ, నేవీ, ఐటీబీపీతోపాటు రాష్ట్రం నుంచి వెళ్లిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఒక్క మృతదే హం కూడా కనుక్కోలేకపోయారు. దీంతో లార్జి ప్రాజెక్టు నుంచి శనివారం ఉదయం గంటసేపు నీటిని విడుదల చేయకుండా గేట్లను మూసివేయనున్నారు. రాష్ట్రం నుంచి సహాయక చర్యలు పర్యవేక్షించడానికి వెళ్లి అక్కడే ఉన్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అదనపు డీజీ రాజీవ్‌త్రివేది పలుమార్లు చేసిన విజ్ఞప్తితో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది.
గేట్లను మూసిన తర్వాత డ్యాం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు ఐదు వందల మందితో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి విహారయాత్రకు వెళ్లిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ మండి జిల్లాలోని బియాస్ నదిలో గత ఆదివారం కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇందులో గురువారం వరకు మొత్తం ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 17 మంది జాడ తెలియ రాలేదు. శుక్రవారం గాలింపు బృందాలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఘటనా స్థలం నుంచి 10 కి.మీ. పరిధిలో వెతికాయి. లార్జి ప్రాజెక్టు నుంచి నీటి ప్రవాహాన్ని కనీసం మూడు గంటల పాటు ఆపగలిగితే కనీసం 3 కిలోమీటర్ల దూరం వరకు నదిలో నీరు తగ్గుతుందని డీజీ రాజీవ్ త్రివేది ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. అయితే ఉదయం 7 నుంచి 8 గంటల వరకే గేట్లను మూస్తామని హిమాచల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకంటే ఒక్క నిమిషం ఎక్కువై నా తమ పవర్ ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని తెలిపింది. ఈ గంట కూడా గేట్లు మూసేందుకు ఇంజనీర్లు అంగీకరించకపోయినా.. చివరికి నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రాజెక్టుకు పై నుంచి మంచుకొండలు కరిగి ఆ నీరు వస్తుందని, దాన్ని ఏమాత్రం నిలువరించినా ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు.
స్వస్థలాలకు మృతదేహాలు: బియాస్ నదిలో గురువారం బయటకు తీసిన అరవింద్, ఉపేందర్ మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అధికారులు అక్కడ్నుంచి అంబులెన్స్‌లో వారి స్వస్థలాలకు పంపారు. మృతదేహాలను గుర్తుపట్టేందుకు వెళ్లిన బంధువులు కూడా అదే విమానంలో వచ్చారు. ఉపేందర్ అంత్యక్రియలను శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వగ్రామమైన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం గట్టాయిగూడెంలో పూర్తి చేశారు.