రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం
కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి
* మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి
* ప్రభుత్వం తప్పించుకోవాలని చూడడం సరికాదు
* రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: ఉత్తమ్
నారాయణఖేడ్ రూరల్: అన్నదాతల ఆత్మహత్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు ఆదివారం వచ్చిన ఆయన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నందున ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, సాగులో నష్టాల కారణంగా రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. 1997 నుంచి 2004 వరకు రైతు ఆత్మహత్యలు కొనసాగడంవల్ల అనంతరం వచ్చిన తమ ప్రభుత్వం విద్యుత్, విత్తనాలు, ఎరువుల సమస్యలను పరిష్కరించిందని గుర్తుచేశారు. రూ.1,300 కోట్లు మాఫీచేసి రైతులకు ఊరట కలిగించినట్లు చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం అట్టహాసాలు, ప్రదర్శనలు, అధికార పటాటోపం తప్ప రైతులను ఆదుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ లింబయ్య మరణంపై ప్రభుత్వం వాద ప్రతివాదనలకు పోకుండా ఆదుకోవాలన్నారు. రైతు ఆత్మహత్యలపై కమిటీల ద్వారా పరిశీలించి సత్యాసత్యాలు నిర్ధారించి బయటపెట్టాలని తెలిపారు. ప్రతీదానికి తప్పించుకోజూడటం సరికాదని ప్రభుత్వానికి హితవుపలికారు.
కలసికట్టుగా పనిచేయాలి
భేదాభిప్రాయాలు విడనాడి కాంగ్రెస్ గెలుపు కోసం కలసికట్టుగా పాటుపడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి సంతాప సభను ఆదివారం నారాయణ ఖేడ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో నిర్వహించారు. కిష్టారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తమ్, జానా మాట్లాడుతూ, భేదాభిప్రాయాలున్నా మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, కిష్టారెడ్డిలు పార్టీ శ్రేయస్సు కోసం కలసి పనిచేశారన్నారు.
ఏదైనా ప్రభుత్వ పథకానికి కిష్టారెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో అడుగుతామన్నారు. సురేష్ షెట్కర్ మాట్లాడుతూ... వైఎస్ అప్పట్లో తనను, కిష్టారెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడి ఒక్కటి చేశారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను పార్లమెంట్ స్థానానికి, కిష్టారెడ్డిని అసెంబ్లీకి పోటీచేయించి కాంగ్రెస్ గెలిచేలా పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కిష్టారెడ్డి కుమారులు సంజీవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
రైతులను వేధిస్తే కేసులు: ఉత్తమ్
బలవంతపు వసూళ్లతో రైతులను వేధింపులకు గురిచేసే ప్రైవేట్ వడ్డీవ్యాపారులపై ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. మరణించిన రైతుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించి చెప్పడం, ఆత్మహత్యలను దాచడానికి ప్రయత్నించడం సరికాదని ఉత్తమ్ అన్నారు.