‘నన్ను నిందించేవాళ్లే అసలు దేశద్రోహులు’
శ్రీనగర్: పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రాంతం భారత జాగీరు కాదంటూ తాను చేసిన వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సమర్థించుకున్నారు. భారత పార్లమెంట్‌లో పీవోకేపై తీర్మానం ఆలోచనను కూడా ఆయన తప్పుపట్టారు. ఆదివారం శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తనను దేశద్రోహి అన్నవారే నిజమైన దేశద్రోహులని మండిపడ్డారు.
‘పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటి నుంచో దాయాది ఆధీనంలో ఉంది. అది మనకే చెందుతుందని భారత్.. భారత భూభాగంలోని కశ్మీర్ తమదని పాకిస్థాన్ దశాబ్ధాలుగా వాదులాడుకుంటున్నాయి. కానీ ఈ రోజుకీ ఎవరి ప్రాంతం వాళ్ల ఆధీనంలోనే ఉంది. దీనిపై ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కొత్తగా మోదీ వచ్చి పీవోకేను తిరిగి తీసుకుంటామంటున్నారు. ఇది జరిగే పనేనా? మోదీకి అంత దమ్ముందా? ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండాల్సిందిపోయి లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారు. ఈ అస్పష్ట విధానాన్నే నేను ప్రశ్నిస్తున్నా’అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
పీవోకేతోపాటు ఉగ్రవాది మసూద్ అజార్, డాన్ దావూద్ ఇబ్రహీంలపై పార్లమెంట్‌లో గతంలోనూ ఎన్నో తీర్మానాలు చేశారని, అయితే ఆ మేరకు ఏ ప్రభుత్వాలు కూడా చర్యలకు దిగలేదని అబ్దుల్లా తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని అక్సాయి ప్రాంతాన్ని పాక్.. చైనాకు అప్పగించినప్పుడు కూడా భారత ప్రభుత్వం మౌనంగా ఉందేతప్ప దానిపై చైనాతో మాట్లాడే సాహసం చేయలేదని అబ్దుల్లా ఆరోపించారు. ‘ఈ అభిప్రాయాలు వెల్లడించినందుకు నన్ను కొందరు దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. నన్నలా నిందించడానికి వాళ్లెవరు? నన్ను దేశద్రోహి అన్నవాళ్లే నిజమైన దేశద్రోహులు’అని ఫరూక్ అబ్దుల్లా నిప్పులుచెరిగారు.