శ్రీనగర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ గతవారం వ్యాఖ్యలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు. పీవోకేను భారత్ ఆక్రమించుకునే అవకాశం ఇచ్చేంత బలహీన దేశం పాక్ కాదని ఆయన బుధవారం అన్నారు. బారాముల్లా జిల్లాలోని ఉడీ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అబ్దుల్లా ప్రసంగించారు. ‘ఇంకా ఎంత కాలం పీవోకే మనదేనని ఈ దేశం చెప్పుకుంటూ ఉంటుంది? అది వీళ్ల అబ్బ సొత్తేమీ కాదు. పీవోకే పాకిస్తాన్‌దే. జమ్మూ కశ్మీర్ భారత్‌ది. 70 ఏళ్లయినా పీవోకేను భారత్ తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది.
కానీ స్వాధీనం చేసుకుంటామని చెబుతూనే ఉంది. ఇది ఎలా జరగుతుందో మేమూ చూస్తాం. పాకిస్తాన్ ఏమీ బలహీన దేశం కాదు.వాళ్లు గాజులు తొడుక్కోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. యుద్ధం గురించి ఆలోచించేముందు మనుషులుగా బతకడం గురించి ఆలోచించాలి’ అని అబ్దుల్లా అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఇరుదేశాల ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, అక్కడి ప్రజలకు ప్రత్యేక వెసులుబాట్లు, రాయితీలు తదితరాలు కల్పిస్తూ 1953లో తెచ్చిన చట్టాలన్నింటినీ తొలగించే కాలం కూడా వచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment