ఇక సభలో సమరం
పార్లమెంటులో తలపడిన అధికార - ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ:సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత.. కేంద్రంలో పదేళ్ల యూపీఏ ప్రభుత్వం గద్దెదిగి ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాక.. ప్రతిపక్ష ఎన్‌డీఏ అధికారం చేపట్టి సర్కారును ఏర్పాటు చేశాక.. ఆ రెండు పక్షాలూ పార్లమెంటులో తొలిసారి తలపడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కారు అహంకారం లేకుండా పనిచేయాలని, హామీలను అమలుచేయాలని కాంగ్రెస్ హితవు పలికితే.. కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ సర్కారు దేశ ఆర్థికవ్యవస్థను భ్రష్టుపట్టించిందంటూ అధికార పక్షం తూర్పారబట్టింది. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగించారు. మంత్రిగా తొలిసారి మాట్లాడిన జైట్లీ.. దేశంలో ఆర్థికవృద్ధి దిగజారటానికి, ద్రవ్యోల్బణం పెరగటానికి, పన్నుల వసూళ్లు తగ్గటానికి, పేదరికం పెరగటానికి నిన్నటి మన్మోహన్ సర్కారే కారణమని ధ్వజమెత్తారు. బలమైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో తమ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను పునరుత్తేజితం చేస్తుందన్నారు.
మైనారిటీల విషయంలో తమ ప్రభుత్వ వైఖరిపై సందేహాలు అవసరం లేదని.. సామాజిక సామరస్యాన్ని, దేశ భధ్రతను కాపాడేందుకు కఠిన చర్యలు చేపడుతుందని చెప్పారు. యూపీఏ సర్కారు పనితీరు ఘోరంగా ఉండటం వల్ల ఆ ప్రభుత్వాన్ని గద్దెదించిన ప్రజలు.. చాలా ఆకాంక్షలతో ఎన్‌డీఏకు అధికారాన్ని కట్టబెట్టారని, అది ప్రభుత్వంపై సక్రమంగా పనిచేయాల్సిన భారం మోపిందన్నారు.
యూపీఏ ఎజెండానే..: ఖర్గే
లోక్‌సభలో కేవలం 44 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. రాష్ట్రపతి ప్రసంగం మొత్తం యూపీఏ ఎజెండా కాపీయేనని పేర్కొంది. ఎన్‌డీఏ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్‌ఖర్గే మాట్లాడుతూ యూపీఏ సర్కారు పదేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తూ.. వీటన్నిటినే చుట్టచుట్టి మోడీ పేరుతో ముందుకు తెస్తున్నారని ఎద్దేవా చేశారు. దేనినైనా ప్రచారం చేయటంలో, మార్కెటింగ్ చేయటంలో నైపుణ్యాలను బీజేపీ నుంచి నేర్చుకోవాలన్నారు. ఉత్త మాటలు చెప్తే పేద ప్రజల పొట్ట నిండదన్నారు. సభలో తమ పార్టీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రజా కార్యక్రమాలను అమలు చేయటానికి సర్కారుపై ఒత్తిడి తేవటంలో తాము ఏమాత్రం వెనక్కు తగ్గబోమని వ్యాఖ్యానించారు. మహాభారతంలో వంద మంది కౌరవులు చాలా తక్కువ మంది ఉన్న పాండవులను ఓడించలేకపోయారని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఎన్‌డీఏ తాను ఎల్లకాలం అధికారంలో ఉంటుందని భావించరాదని.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి దూసుకువస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఖర్గే తన ప్రసంగంలో కొత్త సభ్యులకు ఆహ్వానం పలికారు. మహిళా సభ్యురాలిని స్పీకర్‌గా ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగించటం పట్ల బీజేపీకి అభినందనలు తెలిపారు. ఖర్గే ప్రసంగం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆయన వద్దకు వెళ్లి అభినందించారు.