
తెలంగాణ, ఎస్సీ బిల్లుల కోసం ఉద్యమిస్తాం: మంద కృష్ణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుతోపాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో ఉద్యమించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలోని టెక్నాలజీ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను ప్రాంతీయ అంశంగా, ఎస్సీ వర్గీకరణను సామాజిక న్యాయ అంశంగా భావిస్తూ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఒకే మాటకు కట్టుబడి ముందుకు వెళుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు.
పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లుతోపాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందేవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు డిసెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి చేపడతామన్నారు. భవిష్యత్ కార్యాచరణను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, ఎమ్మెస్‌ఎఫ్ కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్, వివిధ జిల్లాల ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.