చంద్రబాబుపై మందకృష్ణ ఫైర్
మదనపల్లె: ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుకూలంగా ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తే వర్గీకరణ సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా వర్గీకరణ విషయంలో ఎస్సీలు తీవ్రంగా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు మాటల్లో ఘనంగా ఉందని, చేతలు మాత్రం శూన్యమని మందకృష్ణ ఎద్దేవా చేశారు. కుల ఉద్యమాలను సహించేది లేదని సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాలకులు విధ్వంసకరమైన ఉద్యమాలకు విలువనిస్తున్నారన్నారు. ఏప్రిల్ 30న మాదిగల విశ్వరూప మహాసభను విజయవాడలో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా మార్చి 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని 170 నియోజకవర్గాలలో చైతన్య యాత్రలు ప్రారంభిస్తామన్నారు. 50 రోజుల్లో విస్తృతంగా చైతన్య యాత్రలు నిర్వహించి విజయవాడలో 10 లక్షల మందితో పెద్ద ఎత్తున విశ్వరూప మహాసభను నిర్వహిస్తామని చెప్పారు. మార్చి 10 వతేదీన తొలి చైతన్య యాత్ర సీఎం స్వగ్రామం నారావారిపల్లె నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ విశ్వరూప మహాసభలో మాదిగల ఆవేదనను ఆగ్రహంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.