బ్యాంకులు మరిన్ని పాలసీలు విక్రయించాలి: ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: కార్పొరేట్ ఏజెన్సీ విధానానికి మాత్రమే పరిమితంకాకుండా వివిధ కంపెనీల బీమా పాలసీలను కూడా విక్రయించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ మరోసారి సూచించింది. ఇందుకోసం సిబ్బందికి కావాల్సిన శిక్షణని కల్పించాలని ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకులు ఒకే ఒక్క బీమా సంస్థ (జీవిత బీమా, సాధారణ బీమా) పాలసీలను విక్రయిస్తున్నాయి. తద్వారా కార్పొరేట్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాయి. అయితే, బీమా ప్రయోజనాలను మరింత మందికి చేరువ చేసే దిశగా బ్యాంకులు మరిన్ని సంస్థల పాలసీలను విక్రయించడం ద్వారా బ్యాంకులు.. బ్రోకింగ్ ఏజెన్సీలుగా మారాలని కేంద్రం యోచిస్తోంది. 2013-14 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజా సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు ఈ ఆదేశాలను ఎంత వరకూ పాటించాయన్న విషయాన్ని జనవరి 31లోగా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.