మధుర: మధురలోని ఇస్కాన్ దేవాలయ ప్రాంగణంలోని పరిపాలన భవనంలో గత రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో దేవాలయం సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఇస్కాన్ దేవాలయం వద్దకు చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ప్రయత్నించడంతో మంటలు అదుపులోకి వచ్చాయని దేవాలయ కార్యదర్శి మాధవ్ ఇందు వెల్లడించారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో దేవాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారని చెప్పారు.
అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. కానీ అగ్ని ప్రమాదం వల్ల పరిపాలన భవనంలోని జీఎం కార్యాలయం, స్టోర్ రూమ్, ఇతర గదులకు మంటలు వ్యాపించాయని చెప్పారు. ఆ మంటల్లో విలువైన డాక్యుమెంట్లు, ఫర్నీచర్తోపాటు దేవుని సామాగ్రి అగ్నికి ఆహుతి అయిందని చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు.