
కశ్మీర్‌కు తొలి మహిళా సీఎం!
పీడీపీ శాసనసభాపక్ష నేతగా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవ ఎన్నిక
నేడు గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, పీడీపీ నేతలు
శ్రీనగర్/జమ్మూ: ఎట్టకేలకు జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న అనిశ్చితి తొలగింది. రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ(56) అధికారం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పీడీపీ ఎమ్మెల్యేలు గురువారం ఆమెను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన భేటీలో మెహబూబా ముఫ్తీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. పీడీపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా బీజేపీ నుంచి లేఖ రావడమే ఇక మిగిలింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు ఇప్పటికే బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి మద్దతు లేఖ రావడం లాంఛనమే. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నేతృత్వంలో పీడీపీ, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం, సయీద్ ఆకస్మిక మృతితో రాష్ట్రం గవర్నర్ పాలనలోకి వెళ్లడం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌ను కలిసిన తరువాత, పీడీపీ, బీజేపీ నేతలు ప్రమాణ స్వీకారం చేసే తేదీని నిర్ణయిస్తారని పీడీపీ సీనియర్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీకి ఎటువంటి షరతులు విధించలేదన్నారు. ‘గతంలో విస్తృత సంప్రదింపుల అనంతరం ఇరుపార్టీలు అంగీకరించిన ఎజెండా సమగ్రంగా ఉంది.
ఆ ఎజెండాలో ఎలాంటి మార్పులు లేవు. కొత్తగా ఎలాంటి షరతులు విధించలేదు’ అని స్పష్టం చేశారు. బీజేపీ పొత్తుతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే గతంలో అంగీకరించిన ఎజెండా అమలుకు కాలపరిమితి విధించాలని మెహబూబా ముఫ్తీ బీజేపీకి షరతు విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రధానితో భేటీ అయిన మెహబూబా ముఫ్తీకి ఆ డిమాండ్‌కు సంబంధించి ఆయన నుంచి ఏదైనా హామీ లభించిందా? అన్న విషయం తెలియలేదు. అయితే, ఆ భేటీ అనంతరమే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకున్న విషయం గమనార్హం. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలతో రామ్ మాధవ్, ప్రధాని కార్యాలయ సహాయమంత్రి జతేంద్ర సింగ్ నేడు(శుక్రవారం) సమావేశం కానున్నారు. ఆ తరువాత వారు గవర్నర్‌ను కలుస్తారు. శుక్రవారం తనను కలసి ప్రభుత్వ ఏర్పాటులో తమ వైఖరిని స్పష్టం చేయాలంటూ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా మెహబూబా ముఫ్తీకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్ శర్మకు ఇప్పటికే లేఖలు రాశారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటులో తాత్సారం చేస్తూ, బలహీనమైన నాయకత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ మెహబూబా ముఫ్తీని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. రాష్ట్ర సమగ్రతకు సవాలు విసురుతున్న వేర్పాటు శక్తులను ఇలాంటి బలహీన నాయకత్వం ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించారు. 87 మంది సభ్యులున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 27, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. సజ్జాద్ గని లోన్‌కి చెందిన పీపుల్స్ కాన్ఫెరెన్స్ ఎమ్మెల్యేలు ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్రులు సయీద్ ప్రభుత్వానికి మద్దతిచ్చారు.