
చీకటి పడితే ఆ సరస్సులో మంటలే..
బెంగళూరు: సాధారణంగా సరస్సు అనగానే మనసు కొంత హాయి అనిపిస్తుంది కదా! కానీ బెంగళూరులోని వార్దర్ సరస్సు పేరు వింటే మాత్రం అక్కడ ప్రజలకు కొంత చిరాకు, ఏవగింపు దానికి తోడు భయం, ఆందోళనలు కూడా కలిసి వస్తున్నాయట. ఎందుకంటే ఆ సరస్సులోకి చుట్టుపక్కల వ్యర్థాలు అన్ని భారీ ప్రవాహ రూపంలో బుసబుసమంటూ పొంగులు కక్కుతూ వచ్చి చేరుతాయి. అవి ఎంత స్థాయిలో అంటే గాల్లో తేలిపోయి ఇళ్లపై, జనాలపై చేరి వాతావరణం మొత్తం కాలుష్యం చేసేంత పెద్ద నురగలుగా. అంతకంటే పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సరస్సులో మంటలు కూడా వస్తున్నాయట.
ఈ విషయంపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా.. ప్రతి రోజు ఓ గంటపాటు మంటలు మండి ఆ తర్వాత ఆగిపోతున్నాయని స్థానికులు చెప్పారు. ఈ విషయంపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన ప్రొఫెసర్ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైడ్రోకార్బన్లతో కూడిన వ్యర్థాలవల్లే ఇలా జరుగుతుందని చెప్పారు. ఇది ప్రమాదకరమని, దాని ద్వారా టాక్సిన్ వాయువులు విడుదలై వాతావరణానికి హానీ చేస్తాయని చెప్పారు. వార్దర్ సరస్సు బెంగళూరు నగరంలోనే రెండో అతిపెద్ద సరస్సు. దీని రూపం కనిపించకుండా మొత్తం తెల్లటి నురగ కప్పుకొని ఉంటుంది.