ప్రథమ మహిళ.. | first Indian women in any field | Sakshi
Sakshi News home page

ప్రథమ మహిళ..

Published Wed, Feb 14 2018 1:08 PM | Last Updated on Wed, Feb 14 2018 1:08 PM

first Indian women in any field - Sakshi

ఒకప్పుడు గడప దాటాలంటే ఆడవాళ్లకు ఎన్నో ఆంక్షలు. ఎన్నెన్నో కట్టుబాట్లు. ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు అనే భావన.  పరిస్థితి మారింది. నేడు ప్రతీ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. కాలానుగుణంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటూనే... తాము ఎవరి కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు.  విద్య, వైద్య, న్యాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలు... ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో తామేంటో నిరూపిస్తున్నారు.  ఆంక్షలు అణిచివేతలను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన మొదటి మహిళామణులు వీరు...

చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ
బ్రిటీష్‌ సంస్థానంలోని మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్లుగా చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ చరిత్రలో నిలిచారు. చంద్రముఖి కలకత్తా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్‌ విభాగంలో
1883లో పట్టా పొందారు. అదే ఏడాది కదాంబినీ కలకత్తా మెడికల్‌ కాలేజీ నుంచి యూరోపియన్‌ మెడిసిన్‌లో పట్టా పొందారు. 1886లో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మహిళా
డాక్టర్‌గా, ఆనందీ గోపాల్‌ జోషీ సరసన నిలిచారు. చంద్రముఖి బసు బేతూన్‌ కాలేజీలో లెక్చరర్‌గా కెరీర్‌ ప్రారంభించి, అదే కాలేజీకి ప్రిన్సిపల్‌ అయ్యారు. దక్షిణాసియాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కాలేజీ స్థాపించిన మొదటి మహిళగా చరిత్రకెక్కారు.

కామినీ రాయ్‌
బెంగాలీ రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, స్త్రీవాదిగా సుపరిచితమైన కామినీ రాయ్‌ భారత్‌లోనే మొదటి ఆనర్స్‌ పట్టా పొందిన మహిళ. సాహిత్య రంగంలో ఆమె కృషికి మహాశ్వేత, పౌరంకీ, జిబాన్‌, పుండరీక్‌, ద్వీప్‌ ఔర్‌ ధూప్‌, నిర్మాల్య వంటి రచనలు నిదర్శనాలు.

కర్నాలియా సోరబ్జీ
కర్నాలియా భారత్‌లో మొదటి న్యాయవాదిగా, ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో న్యాయ విద్యనభ్యసించిన మొట్టమెదటి మహిళగా గుర్తింపు పొందారు. సామాజిక కార్యకర్తగా,
రచయితగా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తి. విశ్వ విద్యాలయ మహిళా సమాఖ్య, భారత మహిళా సమాఖ్య బెంగాల్‌ శాఖ, బెంగాల్‌ లీగ్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీసెస్‌ ఫర్‌ వుమెన్‌ వంటి సంస్థలతో
కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆమె చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం 1909లో ‘ఖైజర్‌-ఎ-హింద్‌’ అవార్డుతో సత్కరించింది. 

హొమి వైర్‌వాలా
భారత్‌లో మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు. 1930ల్లో కెరీర్‌ ప్రారంభించిన హొమి ముంబై చేరుకున్న తర్వాత తను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి
వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ,రాజకీయ నాయకులతో పనిచేశారు. 1970లో రిటైర్‌ అయిన తర్వాత అనామక జీవితం గడిపారు.  ఆమె సేవలకు గుర్తింపుగా
భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ ప్రకటించింది .

ఆసిమా ఛటర్జీ 
సైన్స్‌ రంగంలో డాక్టరేట్‌ సాధించిన మొదటి భారతీయ మహిళ. పైటోమెడిసిన్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ప్రవీణురాలు. మూర్చ నిరోధక, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా
యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ప్రతిష్టాత్మక ‘ఖైరా ప్రొఫెసర్‌షిప్‌’ పొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా కలకత్తా యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు.
1960లో జాతీయ సైన్స్‌ అకాడమీ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు. 1961లో రసాయనిక శాస్త్రంలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్‌ భట్నాగర్‌’ అవార్డు పొందారు.

బచేంద్రీ పాల్‌
ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. 1984లో పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్‌ సాహస యాత్ర
చేపట్టి, 7 ప్రపంచ రికార్డులు సృష్టించారు. భారత మహిళా సాహస యాత్రికులకు మార్గదర్శకురాలిగా నిలిచారు. హరిద్వార్‌ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో
యాత్ర సాగించిన రాఫ్టింగ్‌ బృందానికి నాయకత్వం వహించారు.

కల్పనా చావ్లా
అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి ఇండో- అమెరికన్‌ వ్యోమగామిగా చరిత్రలో నిలిచారు. 1995లో నాసా ఆస్ట్రోనాట్‌ కార్‌‍్ప్స బృందంలో చేరి, 252సార్లు భూమిని చుట్టి సుమారు
10.4 మిలియన్‌ కి.మీ. దూరం ప్రయాణించారు. అంతరిక్ష నౌక ‘కొలంబియా’లో చంద్రగ్రహ యాత్రకు వెళ్లిన బృందంలో ఒకరైన కల్పనా చావ్లాతో సహా ఆరుగురు వ్యోమగాములు
మరణించారు. మరణానంతరం కాంగ్రెషనల్‌ స్సేస్‌ మెడల్‌, నాసా స్పేస్‌ ఫ్లైట్‌ మెడల్‌, నాసా సర్వీస్‌ మెడల్‌ పొందారు.
 
ఆనందిబాయి గోపాలరావు జోషి
నేటికీ ఆడపిల్లకు చదువెందుకనుకునే సమాజం ఇది....అలాంటిది 18వ శతాబ్దంలోనే వైద్య విద్యనభ్యసించి దేశంలోనే తొలి మహిళా వైద్యురాలుగా గుర్తింపు పొందారు. అంతేకాదు పాశ్చాత్య వైద్యశాస్త్రంలో శిక్షణ పొందిన తొలి మహిళ, అమెరికా వెళ్లిన మొట్టమొదటి భారతీయ స్త్రీ కూడా ఆనందిబాయి గోపాలరావు జోషినే.

శీలా దవ్రే
ఆటో డ్రైవర్‌ అంటే ఇప్పటికి మనకు గుర్తుకు వచ్చేది మగవారే....అలాంటి పురుషాధిక్య రంగంలోకి ప్రవేశించి వారికి ధీటుగా నిలదోక్కుకున్నారు శీలా దవ్రే. పూనాలో జన్మించిన దవ్రే 1988 నుంచి ఆటో నడపడం ప్రారంభించారు. ప్రస్తుతం ఒక అకాడమీని స్థాపించి ఆసక్తి ఉన్న మహిళలకు ఆటో నడపడంలో శిక్షణ ఇస్తున్నారు.

రోషిణి శర్మ
దేశంలో తొలి మహిళా బైక్‌ రైడర్‌. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ బైక్‌ పై ప్రయాణించారు.

అరుణిమా సిన్హా
జాతీయ స్థాయి వాలీబాల్‌ ప్లేయర్ గా‌...ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆమె అధైర్యపడలేదు. ఇంతటితో జీవితం ముగిపోయిందని బాధపడనూలేదు.
క్రీడాకారిణిగా గుర్తింపు ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన  ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.

రీటా ఫారియా పావెల్‌
ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఆసియా తొలి మహిళ, తొలి భారతీయురాలు కూడా. బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యమిచ్చే పోటీలో నిలిచి గెలిచిన తొలి వైద్యురాలిగా కూడా చరిత్రకెక్కారు.

ఆరతి సాహా
ఇంగ్లీష్‌ చానల్‌ను ఈదిన తొలి ఆసియన్‌. 1959లో ఈ ఘనత సాధించారు. 1960లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు పొందిన తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆరతినే కావడం విశేషం.

ఇందిరా గాంధీ
భారత తొలి మహిళా ప్రధాని. తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు ఇందిరా గాంధీ. సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా(1966 నుంచి 1977
వరకూ) పనిచేసి, ‘ఉక్కుమహిళ’ గా గుర్తింపు పొందారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’(1971) అందుకున్న తొలి మహిళగా రికార్డుకెక్కారు. 1999లో బీబీసీ
వారు నిర్వహించిన సర్వేలో ‘సహస్రాబ్ది మహిళ’గా నిలిచారు.

ప్రతిభా  పాటిల్‌
మన దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్‌. 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. 2004 నుంచి 2007
వరకు రాజస్థాన్‌ గవర్నర్‌గా పనిచేశారు. సుఖోయ్‌–30ఎమ్‌కేఐ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా కూడా గుర్తింపు పొందారు.

అంజలి గుప్తా
ఫిలాసఫి చదివి, ఆ విద్యతో ఏమాత్రం సంబంధంలేని త్రివిధ దళాల్లో అత్యంత ప్రమాదభరితమైన వాయుసేనలో చేరారు. భారత వాయుసేనలో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా  చేరిన తొలి మహిళ.  
బెంగళూరులోని ఎయిర్‌ క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెస్టింగ్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ యూనిట్‌లో పనిచేశారు.
 

జస్టిస్‌ ఎమ్‌ ఫాతిమా బీబీ
సుప్రీంకోర్టులో పనిచేసిన తొలి మహిళా న్యాయమూర్తి. మనదేశంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన  మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. తమిళనాడు గవర్నరుగా కూడా పనిచేశారు.

సరళ థాక్రల్‌
అతిపిన్న వయసులో(21) విమానాలు నడిపేందుకు లైసెన్స్‌ పొందిన తొలి మహిళ . లైసెన్స్‌ పొందిన తరువాత,  వెయ్యి గంటలపాటు  విమానాన్ని నడిపి  ‘ఏ’ లైసెన్స్‌
పొందిన మొదటి మహిళ. ఎయిర్‌ మెయిల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందిన  మొట్టమొదటి భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించారు.

దుర్గా బెనర్జీ
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ మొదటి మహిళా పైలట్, కెప్టెన్‌. ‘టొర్నాడో అ–200’ విమానాలను నడిపిన మొట్టమొదటి మహిళ కూడా ఈమెనే.

హరితా కౌర్‌ డియోల్‌
ఆకాశంలో ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధీశాలి హరితా కౌర్‌ డియోల్‌.1994 లో భారత వైమానిక దళంలో ఒంటరిగా విమానంలో ప్రయాణించిన
మొట్టమొదటి మహిళా పైలెట్‌గా  పేరు పొందారు.

ప్రియ ఝింగాన్‌
పోలీసు నేపథ్యం కుటుంబంలో పుట్టి పెరిగారు . సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరికతో 1993 లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో చేరిన  మొట్టమొదటి మహిళా క్యాడెట్‌గా
గుర్తింపు పొందారు.

- ధరణి, సుష్మారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement