పంచలోహ విగ్రహాలు స్వాధీనం
* చోరీ చేసి అమ్మడానికి యత్నించిన ముఠా అరెస్టు
* కేపీహెచ్‌బీలో వలపన్ని పట్టుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పురాతన పంచలోహ విగ్రహాలను చోరీ చేసి అమ్ముతున్న ఆరుగురు సభ్యులున్న దొంగల ముఠాను పోలీసులు శనివారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వసంత్‌నగర్‌లో పక్కా వ్యూహంతో వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పంచలోహ విగ్రహాలు 12వ శతాబ్దం కాలం నాటివని తెలిసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ కోటి వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ నవీన్ మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వంగర మండలం తెనుగులవాడకు చెందిన కొండబత్తిని భిక్షపతి(75) తన వద్దకు వచ్చేవారికి తాయిత్తులు కట్టి డబ్బులు వసూలు చేస్తుండేవాడు. అయితే అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే దురాశతో వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో ఉన్న చెన్న కేశవ స్వామి ఆలయంలోని 12వ శతాబ్దానికి చెందిన చెన్నకేశవ స్వామి, భూ దేవి, శ్రీదేవి పంచలోహ విగ్రహాలను చోరీ చేసి అమ్మాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం అదే జిల్లాలోని వెంకటాపూర్ మండలం అందుగులమెడకు చెందిన బునేని సంపత్, ఆనందపురం గ్రామానికి చెందిన రెడ్డి రవితో కలసి విగ్రహాల చోరీకి పథకం వేశాడు. నూనె మల్లయ్య, గుర్రాల శంకర్, లెంకల మల్లయ్యలతో కలసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. జూలై 15న పథకం ప్రకారం చెన్నకేశవస్వామి గుడిలోని విగ్రహాలను దొంగిలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో వాటని అమ్మడానికి నిర్ణయించారు.
ఈ క్రమంలో వారం కిందట కూకట్‌పల్లిలో అమ్మేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ విషయం కూకట్‌పల్లి సీసీఎస్ పోలీసులకు తెలియడంతో ఇన్‌స్పెక్టర్ సి.హరిశ్చంద్ర రెడ్డి, ఎస్‌ఐలు కె.బాలరాజు, రాజేంద్ర, రవి కుమార్‌తో పాటు ఇతర సిబ్బందితో కలసి దొంగల ముఠాను పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. పంచలోహ విగ్రహాలను తిరిగి పర్లపల్లి గ్రామ పెద్దలకు అందజేశారు. గతంలో కూడా విగ్రహాలు చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు.