జైలు వార్డర్ కటకటాలపాలు
♦ వ్యసనాలకు బానిసై దొంగతో కలసి చోరీల బాట
♦ రూ.5.35 లక్షల ఆభరణాలను రికవరీ చేసిన పోలీసులు
మంచిర్యాల టౌన్: అతను జైలు వార్డర్. వ్యసనాలకు బానిసగా మారి అప్పుల పాలయ్యాడు. జైలు లో దొంగలతో స్నేహం చేసి.. చోరీలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాల య్యాడు. ఓ అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు ఈ విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పోలీసుస్టేషన్‌లో ఏఎస్పీ విజయ్‌కుమార్ శుక్రవారం ఇద్దరు అంతర్‌జిల్లా దొంగల అరెస్టు చూపించారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం రాయపూర్‌కు చెందిన దుబ్బెట బాలలింగం ఓ చోరీ కేసులో సిద్దిపేట సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడ జైలు వార్డర్ గంభీరావు వెంకటేశ్‌తో పరిచయం ఏర్పడింది.
కొద్ది రోజుల క్రితం బాలలింగం జైలు నుంచి విడుదల య్యాడు. తర్వాత జైలు వార్డర్ వెంకటేశ్, బాల లింగం కలసి ఆరుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. సిద్దిపేటలో బైక్‌ను దొంగిలించారు. చోరీ సొత్తును విక్రరుుంచేందుకు శుక్రవారం మంచిర్యాలకు కారులో రాగా పోలీ సులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరి నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, రూ.18 వేల నగదు, బైక్, కారు, డీవీడీ ప్లేయర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ. 5.35 లక్షల విలువైన ఆభరణాలు రికవరీ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వెంకటేశ్ తండ్రి రంగారావు కరీంనగర్ సబ్‌జైలులో డీఎస్పీగా పనిచేస్తున్నారు.