ఇది సరైన తరుణం కాదు
న్యూఢిల్లీ: ఆహార భద్రత బిల్లును తీసుకురావడానికి ఇది సరైన తరుణంకాదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ కేంద్ర ప్రభుత్వ చర్యను విమర్శించారు. ఇప్పటికే ద్రవ్యలోటుతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థ దీంతో మరింత ఒత్తిడిలో పడుతుందని పేర్కొన్నారు. ఆహార భద్రత ప్రణాళికను దేశం భరించగలిగినప్పటికీ ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో బిల్లును తీసుకురావడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాకుండా అవసరాన్నిబట్టి దీనిని చేపట్టాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఆహార భద్రత బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించగా, రాజ్యసభ అనుమతిని పొందాల్సి ఉంది.
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆహార భద్రత బిల్లును వోట్ల భద్రత బిల్లుగా వ్యాఖ్యానించిన విషయం విదితమే. స్థూల ఆర్థిక పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లును చేపట్టడం సమంజసంకాదని జలాన్ చెప్పారు. జీడీపీ మందగమం, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, గరిష్ట స్థాయిలోని రిటైల్ ద్రవ్యోల్బణం వంటి అంశాలతోపాటు మార్కెట్లలో నమ్మకం సడలిన పరిస్థితులున్నాయని వివరించారు.