అటవీ విస్తీర్ణం లెక్క తేల్చండి | Forest Acreage Calculating | Sakshi
Sakshi News home page

అటవీ విస్తీర్ణం లెక్క తేల్చండి

Published Sat, Sep 12 2015 2:00 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

అటవీ విస్తీర్ణం లెక్క తేల్చండి - Sakshi

అటవీ విస్తీర్ణం లెక్క తేల్చండి

సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎంత అటవీ విస్తీర్ణం ఉందో లెక్క తేల్చేలా వాటి వివరాలను వర్గీకరణ చేయాలని సీఎం చంద్రబాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం రెవెన్యూ, దేవాదాయ శాఖలను సమీక్షించారు. రాష్ర్టంలో భూముల వివరాలపై ఎటువంటి గందరగోళానికి తావులేకుండా భూములు, రైతులు, భూ యజమానుల వివరాలను అప్‌డేట్ చేయాలని సీఎం ఆదేశించారు. ఉన్నతాధికారులు ప్రతీ వారం రెవెన్యూ శాఖ సమీక్షలు నిర్వహించి తనకు నివేదికలు ఇస్తే టెలీ కాన్ఫరెన్సు ద్వారా మండలాల వారీ పురోగతిని సమీక్షిస్తానని చెప్పారు.
 
ఆలయాల్లో నిత్యాన్నదానానికి నిధులు
రాష్ట్రంలోని దేవాలయాల్లో నిత్యాన్నదానానికి సీజీఎఫ్ కింద నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని దేవాలయాల్లో అన్నదానం, విద్యాదానం నిర్వహించాలని సూచించారు. ప్రతి దేవాలయం వద్ద ఒక ఆయుష్ వైద్యశాల, యోగా సెంటర్, వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రూ.కోటి కంటె ఎక్కువ రాబడి ఉన్న దేవాలయాలు ఆర్థిక సలహాదారులను నియమించుకోవాలని, మిగిలిన దేవాలయాలు ఆడిటర్లను నియమించుకోవాలని చెప్పారు. 187 పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక పట్టణాలుగా అభివృద్ధి చేస్తామన్నా రు.
 
సీఎంను కలిసిన ఎస్సెల్ గ్రూపు సీఈఓ
తిరుపతిని స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న ఎస్సెల్ గ్రూపు సీఈఓ అమిత్ గోయెంకా శుక్రవారం సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ముఖ్యమంత్రులతో ఏర్పాటుచేసిన స్వచ్ఛభారత్ సబ్‌గ్రూపునకు కన్వీనర్‌గా ఉన్న తాను చెత్త నుంచి విద్యుత్ తయారీపై కేంద్రానికి సిఫారసులు చేయాల్సి ఉన్నందున చెత్త నిర్వహణలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగం గురించి తనకు సూచనలివ్వాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో  చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటు బిడ్డింగ్‌లో పాల్గొనాలని ఎస్సెల్ గ్రూపును కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement