మాజీ అధ్యక్షురాలికి అవినీతి ఉచ్చు!
అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్‌ను అవినీతి ఉచ్చు వెంటాడుతోంది. ప్రజా పనుల విషయంలో ఆమె అడ్డంగా అవినీతికి పాల్పడ్డట్టు వచ్చిన అభియోగాలను ఫెడరల్ జడ్జి జులియన్ ఎర్కొలిని విచారణకు స్వీకరించారు. క్రిస్టినాతోపాటు ఆమె ప్రభుత్వంలో ప్రణాళిక మంత్రిగా పనిచేసిన జులియో డేవిడో, ప్రజాపనుల కార్యదర్శి జోస్ లోపెజ్‌లపై అవినీతి కేసులను కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ అవినీతి వల్ల లబ్ధిపొందిన వ్యాపారవేత్త లాజారో బేజ్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చింది. 633 మిలియన్ డాలర్ల చొప్పున నిందితుల ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, అంతమొత్తంలో ఆస్తులు నిందితుల వద్ద ఉన్నాయా? అన్నది తెలియరాలేదు. 2003 మార్చ్ నుంచి 2015 డిసెంబర్ మధ్యకాలంలో ఈ అవినీతి, అక్రమాలు జరిగినట్టు అధికార పత్రిక పేర్కొన్నది.