మా ఆయన వద్ద నల్లధనం లేదు!
నల్లధనంపై పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేయడంపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ నల్లధనాన్ని దాచి ఉంచారేమో కానీ మా ఆయన లాలూప్రసాద్ వద్ద ఏమాత్రం నల్లధనం లేదు. ఆయనకు వ్యతిరేకంగా 25 ఏళ్లు (దాణా స్కాం) కేసు నడిచింది. కానీ ఆయన వద్ద ఒక్క నయాపైసాను కూడా ఎవరూ కనుగొనలేదు’ అని రబ్రీదేవీ అన్నారు. అదేవిధంగా పెద్దనోట్ల రద్దును బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమర్థిస్తున్న నేపథ్యంలో బీజేపీ-నితీశ్ పొత్తు పెట్టుకోవచ్చునని వస్తున్న వార్తలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కావాలంటే బిహార్ బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ.. నితీశ్‌ను తన ఒడిలో కూచోబెట్టుకోవచ్చునని అన్నారు. అయితే, తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఇవి సరదాకు చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని, ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని మీడియాకు తెలిపారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి అయిన రబ్రీదేవి బిహార్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బిహార్ శాసనమండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిహార్‌లో నితీశ్‌కుమార్ జేడీయూ, ఆర్జేడీ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీయూ మళ్లీ బీజేపీ వైపునకు అడుగులు వేస్తున్నదన్న కథనాలు రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతున్నాయి.