అబ్దుల్ కలాం ఇక లేరు!
మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (84) సోమవారం రాత్రి గంటలకు కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎంలో జరిగే సెమినార్లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన.. అక్కడే వేదికపై తీవ్ర అస్వస్థతతో కుప్పకూలారు. ఆయనను అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోని బెథనీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 1931 అక్టోబర్ 15న ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు.
కలాంను ఆస్పత్రికి తరలిస్తూనే వెంటనే ఆర్మీకి చెందిన వైద్యులను అక్కడకు పిలిపించారు. వాళ్ల పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిన కలాంను దాదాపు మరణించిన పరిస్థితిలోనే తమ ఆస్పత్రికి తీసుకొచ్చారని బెథనీ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. తాము ఆయనను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశామని, అయితే దురదృష్టవశాత్తు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయామని చెప్పారు.