మసీదును కూల్చడం గర్వకారణం | fortunate to demolish babri masjid; bjp mp sakshi maharaj | Sakshi
Sakshi News home page

మసీదును కూల్చడం గర్వకారణం

Published Tue, May 30 2017 1:41 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బాబ్రీ మసీదు విధ్వంసం(ఫైల్‌) పక్కన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ - Sakshi

బాబ్రీ మసీదు విధ్వంసం(ఫైల్‌) పక్కన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌

- బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
- బాబర్‌ విదేశీయుడు.. దానిని బాబ్రీ మసీదు అనొద్దు
- ఏ శక్తీ రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోలేదు


లక్నో: అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేయడం తమకు గర్వకారణమన్నారు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌. మసీదు కూల్చివేత కేసులో నిందితుడిగా కోర్టు ముందు నిలబడటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు మంగళవారం లక్నోలోని సీబీఐ కోర్టుకు హాజరైన ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. భూమిమీద ఏ శక్తి కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోలేదని, అతి త్వరలోనే గుడి నిర్మిస్తామని సాక్షి మహారాజ్‌ చెప్పారు.

1992, డిసెంబర్‌6న జరిగిన మసీదు విధ్వంసంలో మీరు కూడా పాల్గొన్నారా?’ అన్న ప్రశ్నకు ఎంపీ సాక్షి మహారాజ్‌ బదులిస్తూ.. ‘మీరు(మీడియా) మతిలేనివిధంగా మాట్లాడొద్దు. బాబ్రీ మసీదు అని చెప్పే ప్రాంతంలో ముందునుంచి అది(మసీదు) లేనేలేదు. ఆ ప్రదేశం ముమ్మాటికీ రామజన్మభూమే. విదేశీయుడైన బాబర్‌ పేరుతో ఏదో కడితే, దాన్ని ‘బాబ్రీ మసీదు’ అని అంటున్నారు. దాన్ని అలా పిలవొద్దు.. రామజన్మభూమి అని మాత్రమే వ్యవహరించాల’ని చెప్పారు.

25 ఏళ్లనాటి మసీదు విధ్వంసం కేసులో బీజేపీ ముఖ్యనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, సాథ్వి రీతాంబరా, వినయ్‌ కటియార్‌, వీహెచ్‌పీ నేత విష్ణు హరి దాల్మియా, మహంత్‌ రాంవిలాస్‌ వేదాంతి, మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌, వైకుంఠలాల్‌ శర్మ, ధర్మ దాస్‌, చంపత్‌రాయ్‌ బన్సల్‌, శివసేనకు చెందిన సతీశ్‌ ప్రధాన్‌ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఉన్నతన్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ కోర్టులో వీరిపై విచారణ ప్రారంభమైంది. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. అనంతరం వారందరికీ బెయిల్‌ మంజూరుచేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement