మొబైల్ రీచార్జ్‌తో బీమా ఫ్రీ
శ్రీరామ్ లైఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న టెలినార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా రీచార్జ్ చేయించుకుంటే టెలినార్ ఇండియా (గతంలో యూనినార్) ఉచిత జీవిత బీమా అందిస్తానంటోంది. ప్రతి నెలా రీచార్జ్ చేయించుకునే మొత్తానికి 100 రెట్లు అధికంగా బీమా రక్షణ లభిస్తుందని టెలినార్ ఇండియా సీఈవో వివేక్ సూద్ తెలిపారు. ఇలా గరిష్టంగా రూ. 50,000 వరకు బీమా రక్షణను పొందవచ్చు. కానీ ఈ ఉచిత బీమా కావాలంటే మాత్రం రీచార్జ్ మొత్తాన్ని ప్రతి నెలా కనీసం రూ. 20 చొప్పున పెంచుకోవాలని కంపెనీ నిబంధన విధిస్తోంది. రీచార్జ్ మొత్తం రూ. 500దాటితే ప్రతినెలా అదనంగా రీచార్జ్ మొత్తాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. బీమా రక్షణ కావాలనుకునే వారు మాత్రమే ఈ సదుపాయం పొందవచ్చని, అక్కర్లేనివారు సాధారణ రీచార్జ్ చేసుకోవచ్చని సూద్ తెలిపారు.
ఈ బీమా రక్షణ కోసం కంపెనీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తొలి బీమా పథకాన్ని ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్. విజయన్ చేతుల మీదుగా జారీ చేశారు. తొలిసారిగా టెలినార్‌లో సబ్‌స్క్రైబ్ అయినవారికి రెండు నెలలు ఉచితంగా బీమా రక్షణ లభిస్తుంది. ఆ తర్వాత అదనపు మొత్తం రీచార్జ్ చేయించుకుంటేనే ఈ ఉచిత బీమా సౌకర్యం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్‌లైఫ్ సీఈవో మనోజ్ జైన్ మాట్లాడుతూ దీనివల్ల ప్రజల్లో బీమాపై అవగాహన మరింత పెరుగుతుం దన్నారు. గతేడాది రూ. 500 కోట్లుగా ఉన్న కొత్త ప్రీమియం ఆదాయం ఈ ఏడాది రూ. 700 కోట్లు దాటుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.