12 ఐఫోన్లను ధ్వంసం చేశాడు
12 ఐఫోన్లను ధ్వంసం చేశాడు
Published Sat, Oct 1 2016 11:41 AM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM
పారిస్ : ఆపిల్ సంస్థపై కోపోద్రిక్తుడైన ఓ ఫ్రెంచి వ్యక్తి బిజోన్ సిటీలోని ఆ కంపెనీ స్టోర్లో వీరంగం సృష్టించాడు. బౌల్స్ గేమ్లో వాడే ఇనుప బంతితో కొత్త ఐఫోన్లను ధ్వంసం చేశాడు. డార్క్ కళ్లద్దాలు పెట్టుకున్న ఆ వ్యక్తి, స్టోర్లోకి బౌల్స్ గేమ్లో వాడే ఇనుప బంతితో ప్రవేశించాడు. అనంతరం తన ముందు డిస్ప్లే చేసిన ఫోన్లను తీసి పక్కకు పడేశాడు. అలా పడేసిన ఆ ఫోన్లను బంతితో పగులగొట్టాడు. కనీసం 12 ఐఫోన్లను, మ్యాక్బుక్ను ఆ వ్యక్తి ధ్వంసంచేసిన వీడియో బయటికి వచ్చింది. ఆ వ్యక్తి సృష్టిస్తున్న వీరంగానికి వెంటనే స్పందించిన సెక్యురిటీ గార్డు అతని అదుపులోకి తీసుకున్నాడు.
ఈ సంఘటనంతా ఓ వినియోగదారుడు తన కెమెరాలో చిత్రీకరించాడు. కెమెరా ద్వారా సంఘటన చిత్రీకరిస్తున్న విషయం తెలుసుకున్న ఆ ఫ్రెంచి వ్యక్తి మరింత ఊగిపోయి తాను ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడో ఆవేశంగా వివరించాడు. యూరోపియన్ వినియోగదారుల హక్కులను ఆపిల్ కంపెనీ ఉల్లంఘిస్తుందని, దోచుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి కంపెనీ తిరస్కరిస్తుందని పేర్కొన్నాడు. తన నగదును ఎన్నిసార్లు వెనక్కి ఇవ్వమని కోరినా ఇవ్వడం లేదని ఆరోపించాడు. మీరే చూశారుగా దీనికి ప్రతిఫలమని బిగ్గరగా అరుస్తూ మరో ఐఫోన్ను ఇనుప బంతితో పగులగొట్టాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని ఇండిపెండెంట్ రిపోర్టు చేసింది..
Advertisement
Advertisement