వాషింగ్టన్: అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో చదివే భారత సంతతి విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటునందించేందుకుగాను ఓ ఇండియన్ అమెరికన్ వైద్యుల సంఘం విద్యానిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధికి 30 వేల డాలర్ల(రూ.18.72 లక్షలు)ను ఆ సంఘం విరాళంగా ప్రకటించింది.
యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సెంట్రల్ ఫ్లోరిడా అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అధ్యక్షుడు ఉదయ్ ఎ.దేశాయ్ వర్సిటీ డీన్‌కు ఈ మేరకు చెక్కును అందజేశారు. ఈ నిధి నుంచి భారత సంతతి విద్యార్థులకు ‘సీఏపీఐ ఎండీ ఎన్డోవ్డ్ స్కాలర్‌షిప్’ను అందజేస్తారు. కాగా ఫ్లోరిడాలో వైద్యుల సమస్యల పరిష్కారానికి సీఏపీఐ బాగా కృషి చేస్తోందని, ఆ సంస్థ కార్యకలాపాలకు తమ తోడ్పాటును కూడా అందిస్తామని ఫ్లోరిడా మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.