వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడితో పాటు రూమ్‌లో ఉంటున్న సహచరుడైన కొరియా విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పర్డ్యూ యూనివర్సిటీలో డేటాసైన్స్ విభాగంలో చదువుతున్న 20ఏళ్ల వరుణ్ మనీష్ చడ్డా అనే విద్యార్థి తీవ్ర గాయలతో రక్తపు మడుగులో పడి ఉండటం కలకలం రేపింది. అతడు వర్సిటీలోని మెక్‌కట్చెన్ హాల్‌లో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో పొడవటంతో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి బాధితుడి రూమ్‌మేట్, దక్షిణ కొరియాకు చెందిన జి మిన్ షా (జిమ్మిషా)ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతడు సైబర్ సెక్యూరిటీ మేజర్, ఇంటర్నేషనల్ స్టూడెంట్. చడ్డా మృతి గురించి షానే అర్ధరాత్రి 12.45 సమయంలో 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. కాల్ వచ్చిన వెంటనే తొలుత జిమ్మిషాను అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ఈ హత్యపై విశ్వవిద్యాలయ అధ్యక్షుడు మిచ్ డేనియల్స్ విచారం వ్యక్తం చేశారు. చడ్డా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. విద్యార్థులు మొత్తం ఒక చోట సమావేశమై చడ్డాకు నివాళి అర్పించారు.
చడ్డా హత్య జరిగిన రాత్రి విషయాలను స్నేహితులు గుర్తు చేసుకున్నారు. మరో 10 రోజుల్లో చాడ్డా 21వ జన్మదినం ఉందని అతడి స్నేహితులు తెలిపారు. ఆన్‌లైన్ కాల్‌లో అతడు అరుస్తున్నట్లు తమకు వినబడిందని చెప్పారు. ‘‘మంగళవారం రాత్రి చడ్డా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ, మిత్రులతో మాట్లాడుతున్నాడు. అంతలో హఠాత్తుగా కాల్‌లో అతడి కేకలు వినిపించాయి. అయితే.. అక్కడేమి జరిగిందో తెలియలేదు. మర్నాడు నిద్రలేచే సరికి చడ్డా మరణవార్త తెలిసింది’’ అని స్నేహితడు అర్నబ్ సిన్హా పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: చైల్డ్ కేర్ సెంటర్‌పై తూటాల వర్షం.. 34 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment