యువతిని ఫాలో అవుతోందని ఉడుతకు జైలు
బెర్లిన్: ఇదో విచిత్ర సంఘటన. జర్మనీలో జరిగిన అత్యంత అరుదైన దృశ్యం. వినేవాళ్లు హవ్వా అనాల్సిందే. ఎందుకంటే నేరం చేసిన వాళ్లనే పట్టుకునేందుకు చేతగాని పోలీసులు ఓ ఆటవిక ప్రాణిని అరెస్టు చేశారు. పోని ఓ భారీ ప్రాణినా అంటే అది కూడా కాదు. ఒక్కసారి చేయి విదిలేస్తే పారిపోయి చెట్టెక్కి కూర్చునే అల్పప్రాణిని. మరోసారి ఆ ఆ దిక్కు చూస్తే అదిరిపోయి గుండెచేతపట్టుకుని పారిపోయే చిన్నజీవిని. మనకు అత్యంత సుపరిచితమైన జీవిని. ఇంకా చెప్పాలంటే శ్రీరాముడికి తనకు చేతనైనంత సాయం చేసి ఆయన చేతి స్పర్శను తాకిన గొప్ప ప్రాణిని. అదే.. ఉడుత.
అసలు విషయానికి వస్తే జర్మనీలో ఓ ఉడుత ఇప్పుడు జైలు పాలయింది. చక్కగా అక్కడా ఇక్కడా గెంతులు పెడుతూ హుషారుగా తిరగాల్సిన అది చెరసాలలో బిక్కుబిక్కుమంటూ తిండీతిప్పలు మాని కూర్చుంది. నార్త్ రైన్ వెస్ట ఫాలియాలోని బోట్రాప్ నగరంలో ఓ యువతి చేసిన ఫిర్యాదే దానికి శిక్షగా మిగిలింది. ఓ ఉడుత తనను బాగా ఫాలో అవుతుందని, తాను ఎటు వెళితే అటువస్తుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ముందు లైట్గా తీసుకున్న పోలీసులు ఆమె నాన్ స్టాఫ్గా ఫోన్ చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో వెళ్లి దానిని బంధించారు. అనంతరం తీసుకొచ్చి జైలు బోనులో పెట్టారు. అది చిక్కిపోయినట్లు కనిపించడంతో దానికోసం ప్రత్యేకంగా పోలీసు కాపలా ఉండి దానికి ఆహారం పెట్టి పోషిస్తున్నారు.