బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం
బనశంకరి (బెంగుళూరు): పొరుగింటి బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీణ్యాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పొరుగింటికి చెందిన బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో అతను నిత్యం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను కలిసేవాడు.
పాఠశాల ముగిసిన అనంతరం బాలికను హోటల్‌కు, ఇతర స్ధలాలకు తీసుకెళ్లి సరదాగా తిప్పేవాడు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో ఈ నెల 8న బాలికను నమ్మించి సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసిన అనంతరం బాలికను పీణ్యాలో నిర్మాణదశలో ఉన్న ఓ కట్టడం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడికట్టాడు. అనంతరం తన స్నేహితులిద్దరిని పిలిపించుకొని ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలిక తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ఆమె ఇంటికి వెళ్లింది. తల్లికి విషయం తెలిస్తే మందలిస్తుందనే భయంతో బాలిక స్నేహితురాలి ఇంట్లోనే 5 రోజులు గడిపింది. కూతురు ఇంటికి రాకపోవడంతో భయపడిన తల్లి తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పీణ్యా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లి ముందు జరిగిన అకృత్యాన్ని తెలిపింది. దిగ్భ్రాంతికి గురైన తల్లి మళ్లీ పీణ్యాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ముగ్గురు మైనర్ బాలురును అరెస్ట్ చేసి బాలల పరివర్తనా కేంద్రానికి తరలించారు.