చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
Published Thu, Oct 24 2013 2:13 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణం తీసింది. ఓ కన్నతల్లికి కడుపుకోతను మిగిల్చింది. పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన సంఘటన ఇక్కడి నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మల్లాపూర్ గోకుల్ నగర్‌లో నివాసముండే బి.సూర్యకాంత్, యశోద దంపతుల చిన్నకుమార్తె శాంతి(7) మల్లాపూర్‌లోని శ్రీవాగ్దేవి పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. పాఠశాలకు చెందిన బస్సులో రోజూ స్కూల్‌కు వెళుతుంది. రోజులాగే బుధవారం సాయంత్రం బస్సు దిగి ఇంటికెళ్లేందుకు స్కూల్ బస్సును ముందు నుంచి క్రాస్ చేసేందుకు శాంతి ప్రయత్నించింది. ఆమెను గమనించని డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు కదిలించాడు. దీంతో బస్సు శాంతిపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ పారిపోయాడు. శాంతి తల్లిదండ్రులు సంఘటనాస్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించడం అందర్నీ కలచివేసింది.
Advertisement
Advertisement